శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల చుట్టూ భూ వివాదాలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా మంత్రి సీదిరి అప్పల రాజు టార్గెట్‌గా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఆయన అండదండలతోనే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోతున్నాయని విమర్శలు చేశాయి. ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు ఏకంగా మంత్రి సీదిరి అప్పలరాజే రంగంలోకి దిగారు. జిల్లా యంత్రాంగంతో ప్రత్యేక దర్బార్‌ను ఏర్పాటు చేశారు.
పలాస నియోజకవర్గంలో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్లు, ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురైందని భావించిన వాళ్లు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. దీనికి భారీ స్పందన వచ్చింది. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా జనం వచ్చి తమ ఫిర్యాదులు అందజేశారు. ప్రభుత్వ ఆస్తుల ఆన్యాక్రాంతంపై ఆధారాలతో సహా అర్జీలు అందజేశారు.
మున్సిపాలిటీతో సహా పలాస రూరల్, మందస, వజ్రపుకొత్తూరు మండలాల నుంచి వచ్చారు అర్జీదారులు. ప్రతి అర్జీని తీసుకున్న జేసీ ఎం.నవీన్ పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కబ్జాదారులు ఎంతటి వారైనా సహించేది లేదని తప్పులు చేసిన అధికారులను సైతం వదిలిపెట్టబోమంటున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులు కాపాడతామంటున్నారు.
పలాసలో నిర్వహించిన భూదర్బార్ కిక్కిరిసిపోయింది. గత కొంతకాలం నుంచి వస్తున్న కథనాల్లో వాస్తవం లేకపోలేదన్న విషయం స్పష్టమైంది. మంత్రి సీదిరి అప్పలరాజు, జేసీ నవీన్, ఆర్డీవో సీతారామమూర్తి, తహసీల్దార్ ఇతర అధికారుల సమక్షంలో ఈ దర్బార్ సాగింది. ఫిర్యాదులు పోటెత్తాయి.
భూ దర్బార్ నిర్వహించిన పలాస- కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయం బాధితులతోనిండిపోయింది. ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ. నియోజక వర్గంలోని పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీతో పాటు పలాస రూరల్, మందస, వజ్రపుకొత్తూరు మండలాల నుంచి సైతం బాధితులు పోటెత్తారు.
కొన్ని పత్రికలు, వాటి యాజమాన్యాలు తప్పుడు కథనాలు ప్రచురిస్తూ తనను ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. దర్బార్ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన... అక్రమార్కులు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమైతే సహించేది లేదన్నారు. సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ ఆస్తులను కాపాడతామన్నారు.
ప్రైవేటు ఆస్తులను సైతం అక్రమాలకు పాల్పడితే పదిలిపెట్టేది లేదన్నారు. కబ్జాలపై నిగ్గు తేల్చేందుకే భూ దర్బార్ నిర్వహించామన్నారు. ఎవరు ఆక్రమణలకు పాల్పడినా తొలగించాలని కలెక్టర్, జేసీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయని, నిజానిజాలు నిగ్గుతేల్చాలని సూచించామన్నారు.
టీడీపీకి చెందిన వార్డు, గ్రామ స్థాయి నేతల అక్రమణలపైనే ఎక్కువగా ఫిర్యాదులు అందాయన్నారు సీదిరి. తాను గానీ, తన అనుచరులుగానీ ఎక్కడైనా ఒక్క అడుగు ఆక్రమించినట్టు తేలినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి సవాల్ విసిరారు. గౌతు కుటుంబం పేరు చెప్పి నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు.
2012లో జరిగిన అక్రమాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు మంత్రి సీదిరి అప్పలరాజు. దీనికి శివాజీయే బాధ్యత వహించాలన్నారు. శివాజీ హయాంలో వ్యాపారులను ఇబ్బంది పెట్టారని మంత్రి విమర్శించారు. ప్రస్తుతం నగరంలో వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోందన్నారు. పలాస ప్రతిష్ఠకు భంగం కలిగిస్తూ తప్పుడు వార్తలు రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భూ వివాదాల పరిష్కారానికి మరోసారి స్పందన నిర్వహిస్తామన్నారు.