‘విభజన సమయంలో రెండు రాష్ట్రాలకూ న్యాయం చేయాలి అని కోరిన ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ. రెండూ రెండు కళ్లు అని తెలుగు జాతి గురించి ఆలోచించిన పార్టీ తెలుగు దేశం అని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. నాడు నేను కట్టిన హైటెక్ సిటీని తరువాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి కూల్చేసి ఉంటే నేడు హైదరాబాద్ అభివృద్ది జరిగేదా అని ప్రశ్నించారు. తాను తెచ్చిన రింగ్ రోడ్, జీనోం వ్యాలీ లను నిలిపివేసి ఉంటే కోవిడ్ కు వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి ఉండేదా? తన తరువాత అభివృద్ది కొనసాగించిన ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
ఎయిర్ పోర్టు, రింగ్ రోడ్ నేనే తెచ్చాను అని మీరు గుర్తుపెట్టుకోకపోవచ్చు.. కానీ నాకు ఎప్పుడూ ఆ తృప్తి ఉంటుంది.
నాకు ఓట్లు పడకపోవచ్చు. ఓట్లకోసం పని చేయ్యలేదు. తెలుగు జాతి కోసం పనిచేశాను అన్నారు చంద్రబాబు. ఈ రోజు ఎపిలో పరిస్థితి దారుణంగా ఉంది. జగన్ ను సైకో అనాలా.... విధ్వంసకారుడు అనాలా. తెలుగు జాతి గర్వపడేలా అమరావతి ప్రారంభించాను. నాకోసం హైటెక్ సిటీ తెచ్చానా... నా కోసం అమరావతి కట్టానా అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ స్పష్టమైన విజన్ - చంద్రబాబు
దివంగత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ స్పష్టమైన విజన్ ఉందన్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. 1990 లలో ఆర్థిక సంస్కరణలు, ఇంటర్ నెట్ విప్లవం వచ్చాయి. దీనిపై ఆలోచన చేసి నాడు విజన్ 2020 తయారు చేశాం అన్నారు. 20 ఇంజనీరింగ్ కాలేజ్ లు ఉంటే 200 ఇంజనీరింగ్ కాలేజ్ లు పెంచాం.. నాడు నేను విజన్ గురించి చెపితే చాలా మంది నమ్మలేదు. కానీ నాడు నా మాట విని చదువుకున్న వారు నేడు కోటీశ్వరులు అయ్యారు. ప్రపంచంలో మేటి అయ్యారు అని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. నాడు తాను కట్టిన హైటెక్ సిటీని తరువాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి కూల్చేసి ఉంటే నేడు హైదరాబాద్ అభివృద్ది జరిగేదా అని ప్రశ్నించారు.
ఐటీ రంగమే కాదు.. డ్వాక్రా సంఘాలను ప్రోత్సాహం
నాడు విద్యుత్, ఎయిర్ పోర్ట్ లు, టెలికమ్యూనికేషన్ లలో సంస్కరణలు చేశాం. ఒక్క హైటెక్ సిటీ నాడు ప్రారంభించాం. ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో చూడండి. 25 ఏళ్లకు ముందు హైదరాబాద్ ఎలా ఉంది... నేడు నెలా ఉంది. ఒక్క ఐటీ రంగమే కాదు.. డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించాం అన్నారు చంద్రబాబు. ఆడవాళ్లు ఒకరిపై ఆధారపడే అవకాశం లేకుండా డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాం. ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలను తీసుకువచ్చి వారి సామర్థ్యం నిరూపించాం.
‘ఆర్థిక సంస్కరణల ద్వారా దేశానికి దశా దిశా మార్చిన వ్యక్తి పివి నరసింహారావు. పివి సంస్కరణల కు అనుగుణంగా నేను సంస్కరణలు తెచ్చాను. నేను విజన్ అంటే దాన్ని 420 అన్నారు..ఆ 420 అన్నవాళ్లు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. నాడు ఫోన్ ల గురించి మాట్లాడితే హేళన చేశారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ అనేక పనులకు సాధనం అయ్యింది. నేను సెల్ ఫోన్ లు కనిపెట్టలేదు. కానీ నేను ఇచ్చిన నివేదకను ఆధారంగా చేసుకుని టెలికమ్యూనికేషన్ సెక్టార్ లో వాజ్ పేయి మార్పులు చేశారు. నాటి నా ప్రతిపాదనలను వాజ్ పేయి అమలు చేయడం వల్లనే సెల్ ఫోన్ లు చేరువ అయ్యాయి’ అని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రసంగంలో మరిన్ని అంశాలివే..
- దేశంలో మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ శంషాబాద్. దాన్ని తెచ్చింది మనమే. ఓపెన్ స్కైపాలసీ తీసుకువచ్చింది మనమే
- పవర్ సెక్టార్ లో మొదటి ప్రైవేటు పవర్ ప్లాంట్ మన రాష్ట్రంలో వచ్చింది
- గోల్డెన్ క్వార్డిలేటరల్ రహదారులు రావడానికి కూడా టీడీపీ కారణం
- ప్రతిపక్షంలో ఉన్నా.... అధికారంలో ఉన్నా నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగు దేశం పార్టీ.
- కలలు కనండి..వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి అని యువతను ప్రోత్సహించాను
- రాష్ట్రంలో ప్రతి చోటా స్కూళ్లు, కాలేజ్ లు పెట్టి విద్యను అందించాం. ఎపిని మానవ వనరుల కేంద్రంగా మార్చాం.
- మన అభివృద్ది నమూనాగా హైదరాబాద్ నిలిచింది.
- ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించింది ఎన్టీఆర్
- ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా జ్యూయిష్ జాతి ఉంది. వారిని తెలుగు జాతి అధిగమించాలి అని నేను కోరుకుంటున్నా
- 2047కు భారత దేశం అగ్రస్థానంలో ఉండాలి. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలి అని ప్రధానిని కోరాను.
- ఇంజనీరింగ్ కాలేజీలు రావడానికి చంకలో ఫైళ్లు పెట్టుకుని ఢిల్లీలో తిరిగా.
- మంచి ఐటీ కంపెనీలు రావాలి అని బిల్ గేట్స్ వంటి వారిని కలిసి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకువచ్చాను.
- దేని కోసం మైక్రోసాఫ్ట్ తెచ్చాను...ఆ కంపెనీ ఊరికే రాలేదు. ఇతనికి ఇవ్వకపోతే లాభం లేదని బిల్ గేట్స్ తన కంపెనీ ఇక్కడ పెట్టాడు
- ఐఎస్బి సంస్థ హైదరాబాద్ రావడానికి...స్వయంగా వారికి మర్యాదలు చేసి పట్టుపట్టి సాధించాను.
- ఈ రోజు ఎపిలో పరిస్థితి దారుణంగా ఉంది. జగన్ ను సైకో అనాలా....విధ్వంసకారుడు అనాలా
- తెలుగు జాతి గర్వపడేలా అమరావతి ప్రారంభించాను. నాకోసం హైటెక్ సిటీ తెచ్చానా...నా కోసం అమరావతి కట్టానా
- రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇస్తే....దాన్ని నాశనం చేశారు.
- నాడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర భూములు కొనుక్కొండి అని చెప్పాను. ప్రజలు లబ్ది పొందారు.
- ఎపిలో నాలుగేళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేదు. ఎపిలో రాజధాని అంటే మూడు ముక్కలాటగా మారింది.
- రాజధాని లేని రాష్ట్రం చేసినందుకు ప్రతి తెలుగు వాడూ బాధపడాలి
- 7 ఏళ్ల క్రితం ఇదే రోజున పట్టిసీమను జాతికి అంకితం చేశాను.
- దేశంలో తొలి సారి పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం చేశాం.
- ఆ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రైతులకు సాగునీరు అందింది. తద్వారా రాయలసీమ రైతులకూ నీరు అందింది.
- గోదావరి, కృష్ణా నదుల నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు సస్యశామలం అవుతాయి.
- ఎపిలో విభజన కంటే...జగన్ సైకో వల్ల ఎక్కవ నష్టం జరిగింది
- ఎపిలో ఇప్పుడు గన్ కల్చర్...గంజాయి కల్చర్.
- మొన్నటి వరకు గొడ్డళ్లు... ఇప్పుడు ఎపిలో గన్ కల్చర్ వచ్చింది
- అయితే ఇప్పుడు ఏపిలో ప్రజల నుంచి తిరుగుబాటు ప్రారంభం అయ్యింది. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి బుద్దిచెప్పారు.
- వచ్చే ఎన్నికల్లో కూడా ఈ తిరుగుబాటు కనిపిస్తుంది.టీడీపీ అధికారంలోకి వస్తుంది.
- తెలుగు దేశం పార్టీకి తెలంగాణలో పూర్వవైభవం రావాలి. ఇక్కడ తెలుగు దేశం పార్టీ చారిత్రక అవసరం.
- ఎపిలో పునర్ నిర్మాణం జరగాలి.
- నేడు తెలుగు జాతి ప్రజలు గ్లోబల్ సిటిజన్స్ గా ఉన్నారు.
- 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలో అగ్రగామి జాతిగా ఉండాలి
- నేడు 12 శాతం జనాభాకు రోజుకు రూ.150 మాత్రమే ఆదాయం
- 22 శాతం జనాభాకు రోజుకు ఆదాయం రూ.350 మాత్రమే
- 1 శాతం ప్రజలు దగ్గరే 63 శాతం సంపద ఉంది.
- పేద వాడికి అండగా ఉంటా....పేదరిక నిర్మూలన చేసేవరకు విశ్రమించను. ఇదే నా సంకల్పం.
- మేధావులు, డబ్బులు ఉన్నవారు, సంపద ఉన్నవారు నిరుపేదలకు అండగా ఉండాలి
- టీడీపీ వచ్చిన తరువాత సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి...వాటితో పాటు అభివృద్ది కూడా చేస్తాం. సంపద సృష్టించి పేదలకు ఆ సంపద అందిస్తాం.
- సంక్షేమంతో పాటు అభివృద్ది ప్లస్ అనేది ఆలోచన. అంటే ఏం చేస్తే పేదల ఆదాయం పెరుగుతుందో అది చేస్తా
- నాడు జన్మభూమి అనే స్లోగన్ ఇస్తే అంతా తరలి వచ్చారు. అభివృద్దిలో భాగస్వాములు అయ్యారు.
- 10 కోట్ల జనాభా కలిగిన తెలుగు జాతి. ఆ పేద కుటుంబాలను ఆదుకోవాలి. ఆర్థిక అసమానలతను మార్చేలా ప్రతి ఒక్కరు పని చేయాలి. ఇందుకు నేడు నాంది కావాలి
- ప్రతి ఇంటికి విజన్ ఇస్తాం...ప్రజలకు ఏడాదికి ఏం చేస్తాం...5 ఏళ్లకు ఏం చేస్తాం...10 ఏళ్లకు ఏం చేస్తాం అనేది చెపుతాం
- మేథావులు, ప్రజలు రాజకీయాల గురించి ఆలోచించాలి. రాజకీయాలు నాకెందుకు అని ప్రజలు అనుకోకూడదు.
- ప్రజల జీవితాలను మార్చేది రాజకీయం, ప్రభుత్వ పాలసీలు. ప్రజలు రాజకీయం మాకెందుకు అనుకోకుండా మంచి వారిని రాజకీయాల్లో ప్రోత్సహించాలి
- దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసి..అంతా డిజిటల్ గామార్చాలి.
- ప్రజలు తెలుగుదేశాన్ని ప్రోత్సహించాలి. నేరుగానో, సోషల్ మీడియా ద్వారానో టీడీపీకి సహకరించాలి. వీటితో పాటు తెలుగు దేశం పార్టీకి విరాళాలు ఇచ్చి ప్రోత్సహించాలి అని కోరుతున్నా
- ప్రతి ఒక్కరు రూ.5 వేలు ఇస్తే టీడీపీ శాశ్విత సభ్యత్వం ఇస్తాం
- ప్రజలతో పార్టీ నడపాలి అనేది నా సంకల్పం... అందుకే విరాళాలు కోరుతున్నా. మన పార్టీ వల్ల ఫలితాలు పొందిన వారు టీడీపీకి ఆర్థికంగా మద్దతు ఇవ్వాలి.
- ఇంటింటికీ తెలుగు దేశం తెలంగాణలో బాగా జరుగుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ లో టీడీపీకి పూర్వవైభవం ఖాయం
- తెలుగు జాతికి మూడు అంశాలు. 2047కు తెలుగు జాతి గ్లోబల్ లీడర్ కావాలి. తెలుగు జాతి ఒకటే కుటుంబంగా ముందుకు సాగాలి. కులం, మతం,ప్రాంతం అనే అంశాలకు అతీతంగా ఆయా వర్గాలకు చేయూతను ఇవ్వాలి.
- తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు దేశం ఉంటుంది, ఎన్టీఆర్ ఉంటారు.