Nara Lokesh: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేష్ గురువారం విశాఖ కోర్టుకు హాజరయ్యారు. సాక్షిపై పరువునష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరు అయ్యారు.. విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకి లోకేష్ హాజరయ్యారు. ‘చినబాబు చిరుతిండి..25 లక్షలండి’ పేరుతో 2019 అక్టోబర్ 22న సాక్షిలో అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తనను డ్యామేజ్ చేయాలని ఈ స్టోరీ వేశారని నారా లోకేష్ అప్పట్లో వాదించారు. అసత్య ఆరోపణలతో తనను కించపరిచేలా కథనం రాశారంటూ సాక్షి పత్రికకు నారా లోకేశ్ నోటీసులు పంపించారు. అయినా ఆ వార్తపై సవరణ ప్రచురించకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో అప్పట్లో కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. సాక్షి కథనంలో రాసిన తేదీల్లో తాను విశాఖలో లేనని అయినా అక్కడి ఎయిర్ పోర్టులో తానేవో తిన్నట్లు రాశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. చాలా రోజులుగా వాయిదా పడిన ఈ కేసు మంత్రి నారా లోకేశ్ క్రాస్ ఎగ్జామినేషన్‌తో మళ్లీ మొదలైంది. కోర్టుకు హాజరైన తరువాత లోకేశ్ మీడియాతో మాట్లాడారు.
నేను జగన్ అంత లగ్జరీ కాదు
తాను జగన్ అంత లగ్జరీ కాదని, రుషికొండ ప్యాలెస్ కోసం ఆయన రూ.500 కోట్ల ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టారని లోకేశ్ అన్నారు. పర్యావరణ చట్టాలు ఉల్లంఘించినందుకు రూ.200 కోట్లు జరిమానా కూడా కట్టారని ఆరోపించారు. సాక్షి ప్రచురించిన ఆర్టికల్ పై పరువునష్టం కేసు విషయంలో సాక్షిని వదిలిపెట్టేది లేదన్నారు. సాక్షి పత్రిక అసత్యాలకు అడ్డుకట్ట వేయాలనే పరువు నష్టం కేసు వేసినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా వ్యాఖ్యలు రాయడం ఆ పత్రిక నైజం అన్నారు. మంత్రిగా ఉన్నా కూడా తాను ఎప్పుడూ ప్రభుత్వ సొమ్మును దుబారా చేయలేదన్నారు. కోర్టు కేసు కోసం విశాఖ వచ్చినా తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని ఉపయోగించుకోలేదన్నారు. కనీసం ప్రభుత్వ సొమ్ముతో వాటర్ బాటిల్ కొనలేదని, కాఫీ కూడా తాగనని స్పష్టం చేశారు నారా లోకేష్.
ప్రభుత్వ సొమ్ము సొంతానికి వాడుకున్నారు
మాజీ సీఎం జగన్ ప్రభుత్వ సొమ్ముని సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. తన మొహం కనిపించేలా భూముల్లో హద్దురాళ్లను వేయించడానికి సిద్ధమయ్యారని, రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. ఈ క్రమంలో ఆయన సాక్షి మీడియాపై సెటైర్లు విసిరారు. సాక్షి లోగోని పైకెత్తి చూపుతూ.. బ్లూ మీడియా అన్నారు. రెడ్ బుక్ విషయంలో సాక్షి విలేకరి అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు. తప్పులు చేసిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని.. తాను పదే పదే చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో తాను యువగళం యాత్ర చేయకుండా జగన్ జీవో తెచ్చారని.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ యథేచ్ఛగా ఎక్కడికంటే అక్కడకు వెళ్లగలుగుతున్నారని అన్నారు. అప్పుడున్న రాజారెడ్డి రాజ్యాంగం ఇప్పుడు అమలులో లేదన్నారు.
కట్టుబడి ఉన్నాం
ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని, అన్నింటినీ దశలవారీగా అమలు చేస్తామని నారా లోకేష్ అన్నారు. తల్లికి వందనం కూడా త్వరలో అమలులోకి వస్తుందన్నారు. గతంలో వెయ్యి రూపాయల పింఛను పెంచేందుకు జగన్ కు ఐదేళ్లు పట్టిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలరోజుల్లోనే వెయ్యి రూపాయల పింఛను పెంచారని లోకేష్ అన్నారు. ఎలాంటి గందరగోళం లేదని, హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. తాజాగా ముంబై హీరోయిన్ వ్యవహారంలో వైసీపీ నేతల బండారం బయటపడిందని, అన్నింటినీ విచారిస్తామని లోకేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలు జరిగాయని, గత ప్రభుత్వ భూ అక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. జగన్ వైఖరి వల్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని అన్నారు. రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీని గతంలో ఒప్పించామని వెల్లడించారు.