పవన్ కల్యాణ్ అనకాపల్లి సమీపంలోని విస్సన్నపేట పర్యటన కొండను తవ్వి వెంట్రుకను బయటకు తీసిన చందంగా ఉందని ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మీద ఇష్టమొచ్చిన రీతిలో ప్రేలాపనలు, అభాండాలు వేయడాన్ని తప్పుబట్టారు. అలాంటి వ్యక్తిని చూసి స్ఫూర్తి పొందాలని అన్నారు. సినిమాల్లోనే హీరో అయిన ఆయన నిజజీవితంలో జగన్ లాంటి హీరోలు ఉంటారని, ఆయన్ని చూసి ప్రేరణ పొందాలని అన్నారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి వారిని చూసి ఈర్ష పడితే పడొచ్చు కానీ, ప్రజా నాయకుడిని చూసి ఈర్ష పడడం ఏంటని ప్రశ్నించారు. విశాఖపట్నంలో నేడు (ఆగస్టు 14) గుడివాడ అమర్ నాథ్ పవన్ కల్యాణ్ విస్సన్నపేట పర్యటనపై మాట్లాడారు.


గత ప్రభుత్వాల ఆక్రమణల గురించి పవన్ కల్యాణ్ నోరెత్తలేదని అన్నారు. రుషికొండకు వెళ్లిన సమయంలో కూడా ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకుంటే గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న భూములు కనిపించేవని అన్నారు. ‘‘విశాఖపట్నం జిల్లాలోని విస్సన్నపేటలో పర్యటన సందర్భంగా మేం అక్రమాలు చేశామని ఆరోపించావు. దానికి సంబంధించి ఏమైనా రుజువు చేశావా? రైతులు కానీ, భూముల రైతులు గానీ ఎవరైనా ఫిర్యాదులు చేశారా?’’ అని గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు.


తాను ఎవరిని ఇబ్బంది పెట్టానో చెప్పాలని అడిగారు. పవన్ లాగా అన్నను అడ్డం పెట్టుకొని రాలేదని కౌంటర్‌ వేశారు. చిరంజీవి తమ్ముడు కాకుంటే పవన్‌ను ఎవరూ చూడరని అన్నారు. 18 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేశారు. ‘‘మీ నాన్న కానిస్టేబుల్‌ అవ్వక ముందే మా తాత ఎమ్మెల్యేగా ఉండేవారు. మీ అన్న పేరుతో నువ్వు సినిమాల్లోకి వచ్చావు.  మా నాన్న రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదు. ఆయన చనిపోయిన 18 ఏళ్ల తరవాత సీఎం జగన్ దయవల్ల ఈ స్థాయికి వచ్చాను’’ అని అన్నారు.


నేడు గడపగడపకు కారర్యక్రమంలో పవన్ 


నేడు మంత్రి అమర్ నాథ్ అనకాపల్లి మండలం వేటజంగాలపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. వేటజంగాలపాలెం గ్రామంలో ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు బదులుగా వేరే చోట ఇచ్చిన స్థలాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని గుడివాడ అమర్నాథ్ వారికి హామీ ఇచ్చారు. వేట జంగాలపాలెంలో సుమారు 25 లక్షల రూపాయలతో నిర్మించిన వైఎస్సార్ విలేజ్ హెల్త్ సెంటర్ ను మంత్రి అమర్ నాథ్ ప్రారంభించారు. సుందరయ్య పేటలో 25 లక్షల రూపాయలతో నేర్పించిన వెల్ నెస్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలోని సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయని అన్నారు. విద్య, ఆరోగ్యం. వ్యవసాయ రంగాలను పూర్తిస్థాయిలో బలోపేతం చేసి  గ్రామీణ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచిందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, తాను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని అమర్నాథ్ చెప్పారు. ప్రజల మేలుని కాంక్షించే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని విజ్ఞప్తి చేశారు.