విశాఖపట్నం: భారతదేశం జనాభా వేగంగా పెరుగుతోంది. ఎంతలా అంటే జనాభాలో తొలి స్థానంలో ఉండే చైనాను వెనక్కి నెట్టి మరి మన దేశం ముందుకు వెళుతోంది. 140 కోట్లు దాటినా దేశ జనాభాకు అవసరమైన ఆహారాన్ని అందిచేవాడు మన రైతన్న. దేశ ప్రజల ఆకలి తేర్చే అపద్భాందవుతు రైతన్న. ఇటువంటి రైతుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం. దేశానికి సైనికులు, రైతులు రెండు కళ్లవంటివారు అని మాజీ ప్రధానులు సైతం ప్రస్తావించేవారు. సైనికులు దేశ సరిహద్దులో రక్షణగా నిలబడి మన ప్రాణాలను నిరంతరం పరిరక్షిస్తుంటారు.
రైతన్నలు ఎండ, వాన ఎరుగక మనకోసం ఆహారాన్ని పండించే మహా యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. వీరిద్దరిని గౌరవిస్తూ నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ సరికొత్తగా 80 శాతం మిలెట్స్(చిరుధాన్యాలు), కొద్దిపాటి(20 శాతం) రంగులు ఉపయోగించి సందేశాత్మక చిత్రం తీర్చిదిద్దారు. దీనిలో నాగలి పట్టిన రైతన్న చిత్రాన్ని మిల్సెట్స్‌తో తయారు చేశారు. మన దేశంలో పండే చిరుధాన్యాల పంటలను నేలపై పరిచి, పంటగా చూపారు.
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం
2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రోత్సహించాలని, చిరుధాన్యాలకు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని, రైతును, చిరుధాన్యాలను మిళితం చేస్తూ తీర్చిదిద్దిన ఈ తైలవర్ణ, చిరుధాన్యాల చిత్రపటం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. దాదాపు నాలుగు రోజులుగా దీనిని తయారు చేయడానికి విజయ్ కుమార్ శ్రమించారు. ప్రధాని నరేంద్ మోదీ ఇచ్చిన పిలుపును నినాదాన్ని సైతం దీనిలో పొందుపరిచారు. మై సాయిల్– మై కంట్రీ, సాల్యూట్ టు ది సాయిల్–సాల్యూట్ టుద బ్రేవ్’ అనే సందేశాన్ని చిత్రించారు. ఈ చిత్రపటాన్ని జల్లా కలెక్టర్‌కు బహూకరించనున్నట్లు విజయ్‌కుమార్ తెలిపారు.