Botsa satyanarayana: ఏపీలో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. అధికారపక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో  పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. పరస్పర విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.  తాజాగా.. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన గడప గడపకు విజయోత్సవ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


వచ్చే ఉగాదికి (ఎన్నికల తరువాత) రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉండవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఒకవేళ ఉంటే తాను గుండు కొట్టించుకుంటానన్నారు. పచ్చపత్రికలు అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పెట్టిన పార్టీ వైసీపీ అన్నారు. మామూలు పనులు చేసే వ్యక్తి సీఎం జగన్ కాదన్నారు. గడప గడపకు కార్యక్రమంతో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడంతో పాటు స్థానిక నాయకులకు, కార్యకర్తల్లో ధైర్యం నింపుతున్నట్లు చెప్పారు. 


రాజకీయాల్లో నలబై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి, మరో పక్క సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిని ఆడిపోసుకుంటే నాయకుడు అయిపోతాడని పవన్ కల్యాణ్ అనుకుంటున్నాడని మండిపడ్డారు. అన్నయ్య చిరంజీవి మూసేసిన పదిహేను సంవత్సరాల తరువాత పవన్ దుకాణం తెరిచారని విమర్శించారు. రాజకీయాల్లో ఇలాంటి వారితో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదన్నారు. 


అలాగే పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైనా మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోంచించాలని, మైక్ పట్టుకొని మాట్లాడినపుడు వాటిపై అద్యయనం చేసి మాట్లాడితే రాజకీయంలో మనుగడ ఉంటుందని హితవు పలికారు. ఏది పడితే అది మాట్లాడితే జనం ఛీ కొడతారని అన్నారు. అవగాహానలేని చేతలు, మాటలు మాట్లాడే సెలబ్రెటీ అని పవన్‌ను దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, ప్రధాని మీద మాట్లాడి పెద్ద వాడైపోయానుకుంటున్నాడని ఆరోపించారు. 


ఎన్నికలకు నాలుగు రోజుల ముందు చంద్రబాబు తోటపట్టి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేసి నిన్న వచ్చి మళ్లీ నేనే చేశానని చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు.  ఉద్దానం కిడ్నీ బాధితులను ఏనాడు చంద్రబాబు పట్టించుకోలేదని, ఇప్పుడు వచ్చి కేకలు వేస్తున్నారంటూ మండిపడ్డారు.  


ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. సీఎంను ఆడిపోసుకుంటే ఆ రాజకీయ పార్టీలు కొట్టుకు పోతాయన్నారు. వచ్చే కొత్త అమావాస్య తరువాత (సార్వత్రిక ఎన్నికలను ఉద్దేశించి) ఈ రెండు పార్టీలు ఉంటే గుండు కొట్టించుకుంటానని బొత్స సత్యనారాయణ అన్నారు. 


అసలు జనసేన విధానం, పవన్ విధానం ఏంటని బొత్స ప్రశ్నించారు?  పవన్ కళ్యాణ్ రాజకీయ దుకాణం తెరిచి 15 ఏళ్లు అవుతుందని, అందులో ఏ వస్తువు క్వాలిటీలేదని ఆరోపించారు. మరోవైపు వలంటీర్లపై కూడా మాట మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తికి లోకల్ స్టాండ్ లేదా అని అన్నారు. రాత్రి ఒక మాట, పగలు ఒకమాట, సెట్ అయితే ఒక మాట, సెట్ కాకపొతే మరోమాట మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఇలాంటి వారితో రాజకీయాలంటే అసహ్యం వేస్తుందని మంత్రి బొత్స విమర్శించారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial