Gangavaram Port :  గంగవరం పోర్టు కార్మికులు  చేస్తున్న ఆందోళనకు ముగింపు పలకాలన్న ఉద్దేశంతో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో మిందిలోని ఆయన నివాసంలో కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. అయితే చర్చలు పూర్తిగా కొలిక్కి రాలేదు. శుక్ర, శనివారాల్లో ఈ చర్చలు జరిగాయి.  మరోసారి సోమవారం భేటీ అయ్యే అవకాశం ఉంది.  ఇప్పటికే కార్మికుల డిమాండ్లు కొన్నింటిని పోర్టు యాజమాన్యం అంగీకరించింది. మరికొన్ని ప్రధాన డిమాండ్ల సాధన కోసం కార్మికులు మంత్రి అమర్‌నాథ్‌ను కలిశారు. ఇంక్రిమెంట్‌ పెంపుదల విషయంలో కార్మికులు, యాజమాన్యానికి మధ్య స్పష్టమైన ఒప్పందం కుదరాల్సి ఉంది. 


సోమవారం మరోసారి చర్చలు


పోర్టును షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ కింద కాకుండా ఫ్యాక్టరీ యాక్ట్‌ కింద తీసుకురావాలని కార్మికుల డిమాండ్‌ చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లను మంత్రి అమర్‌నాథ్‌ ముందు ఉంచారు. దీనిపై మంత్రి అమర్నాథ్  కార్మికులు నష్టపోకుండా డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సోమవారం మరోసారి కార్మికులు, నాయకులతో సమావేశమై సమస్యలను ఓ కొలిక్కి తీసుకొస్తామన్నారు.  


కార్మికులతో చర్చలు జరుపుతున్న మంత్రి అమర్నాథ్                            


డిమాండ్ల సాధన కోసం కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితులు ఆందోళనలు చేస్తున్నారు.  ఆందోళనకారుల్ని అడ్డుకోవడానికి పోలీసులు పోర్టు ప్రాంతంలో కంచెలు ఏర్పాటు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నిర్వాసితులు, కాంట్రాక్టు కార్మికులు 45రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. కార్మికుల వేతనాలను 12వేల నుంచి 22వేలకు పెంచాలని కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. దీంతో పాటు నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. జెట్టీ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. అయితే ఇటీవల ఆందోళన చేసినప్పుడు వారం రోజుల సమయం కావాలని పోర్టు యాజమాన్యం అడగడంతో..  కార్మికులు ఒప్పుకున్నారు. 


పూర్తిగా అదానీ పరం అయిన గంగవరం పోర్టు                                                          


గంగవరం పోర్టు పూర్తిగా ప్రైవేటు పోర్టు అయింది. ఈ పోర్టు ప్రమోటర్‌గా డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబం  . పోర్టులో ఆయనకు 58.1% వాటా ఉండేది. అంతర్జాతీయ కంపెనీ అయిన వార్‌బర్గ్‌ పిన్‌కస్‌కు 31.5% వాటా ఉండేది. ఏపీ ప్రభుత్వానికి 10.4% వాటా ఉండేది. వీరందరి నుంచి పోర్టును రూ.6,200 కోట్లకు కొనుగోలు చేసినట్టు అదానీకి చెందిన ఏపీసెజ్‌ 2021 సెప్టెంబర్‌లో ప్రకటించింది. డీవీఎస్‌ రాజుకు సంబంధించిన 58.1% వాటాను రూ.3,604 కోట్లకు, వార్‌బర్గ్‌కు చెందిన 31.5% వాటాను రూ.1,954 కోట్లకు, ఏపీ ప్రభుత్వానికి చెందిన 10.4% వాటాను రూ.645 కోట్లకు కొనుగోలు చేసినట్టు అదానీ గ్రూప్‌ ప్రకటించింది.