Minister Amarnath: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను అమ్మవద్దన్నదే వైసీపీ ప్రభుత్వ విధానమని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్ఫష్టం చేశారు. అమ్మే ప్రసక్తే లేనప్పుడు ప్లాంటు ప్రైవేటీకరణ, ఎవరు కొంటారు, ఎంతకు కొంటారు అనే ప్రశ్నలే ఉత్పన్నం కావని మంత్రి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయని, ఇప్పుడేమో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం బీఆర్ఎస్ బిడ్ వేస్తుందని వార్తలు వస్తున్నాయని మంత్రి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడానికి వీలు లేదని కేసీఆర్ చెప్పినప్పుడు.. మళ్లీ కొంటామని అనడం ఎందుకని, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయమని వారి ఉద్దేశమా అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పై కేసీఆర్ నుండి గానీ బీఆర్ఎస్ పార్టీ నుండి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన తాను వినలేదని  గుడివాడ అమర్నాథ్ అన్నారు. 


స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న తమనే.. మీరే కొంటారా, ఎంతకు కొంటారు అని ఎలా అడుగుతారని మంత్రి అమర్నాథ్ మీడియాను ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని చెప్పిన కేసీఆరే.. స్టీల్ ప్లాంట్ కోసం బిడ్ వేయనున్నారని ఎలా రాస్తారని మీడియాను నిలదీశారు మంత్రి. రాజకీయగా ఇలాంటివి ఎన్నో అవాస్తవాలు ప్రచారంలోకి వస్తాయని, వాటికి ఆధారాలు అంటూ ఉండవని వాటిపై ఎలా స్పందించాలని, ఏమని స్పందించాలని మంత్రి అన్నారు. 


విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీఆర్ఎస్ ఏదైనా అధికారికంగా మాట్లాడితే..  వాళ్ల స్టాండ్ ఏమిటో తెలిస్తే దానిపై తాను మాట్లాడటం కరెక్టు అని మంత్రి అమర్నాథ్ చెప్పారు. రాజకీయాల కోసం గాలి వార్తలను ప్రచారం చేస్తుంటారని, వాటిని నమ్మాల్సిన అవసరం లేదని, వాటిపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అని రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ గా భావించే పరిశ్రమను ఎట్టిపరిస్థితుల్లో వదులుకోబోమని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు. 


విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు నిన్న వార్తలు వచ్చాయి. ఈ మేరకు అధికారులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారని, విశాఖ ఉక్కు బిడ్డింగ్ పై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. సింగరేణి సంస్థ ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తల్లో పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు బిడ్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. దీంతో ఆలోగా పరిశీలించి తెలంగాణ సర్కారు బిడ్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 


గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కేసీఆర్ బహిరంగంగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. దేశంలో బీఆర్ఎస్ అనుకూల ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేస్తామంటూ ఏకంగా బహిరంగ సభలోనే చెప్పుకొచ్చారు కేసీఆర్. అయితే ప్రస్తుతం బిడ్ దాఖలు చేస్తామని చెప్పినట్లు ఎక్కడా అధికారికంగా రాలేదు.