తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు ఏపీ ప్రజలను మోసం చేసేందుకే కేసీఆర్, కేటీఆర్‌ మరో ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి. స్టీల్‌ప్లాంట్ సెంటిమెంట్‌తో 2024లో లబ్ధి పొందే ప్రయత్నాల్లో ఉన్నారని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయబోతుందని వస్తున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 





కెసిఆర్, కేటీఆర్ స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం యువత ప్రాణాలు ఫణంగా పెట్టొద్దని హితవు పలికారు విష్ణువర్దన్ రెడ్డి. సెంటిమెంట్ రాజకీయాలకు పేరు మోసిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ను ఆయుధంగా చేసుకోబోతోందన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట అన్నట్టు ఉందని కేసీఆర్ వ్యవహారమని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లికి  సింగరేణితో కలిసి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టిస్తానని కోతలు కోసి నాలుగేళ్లు దాటిపోయిందని గుర్తు చేశారు. కనీసం పునాది కూడా పడలేదన్నారు. 






ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేస్తున్న విష్ణువర్దన్ రెడ్డి... చివరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఇదంతా ఓట్ల కోసం చేస్తున్న గిమ్మిక్కుగానే అభివర్ణించారు. మొన్న సింగరేణిని మోదీ ప్రైవేటుపరం చేస్తున్నారని ఆందోళనలు చేశారని... ఇప్పుడు మాత్రం సింగరేణితో విశాఖ స్టీల్ ప్లాంట్‌నే కొనిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. నాటి ఆరోపణలు ఇప్పుడు చేస్తున్న ప్రతిపాదనకు ఎక్కడా పొంతన లేదన్నారు. ఇలా అయితే దొరికిపోతామని మీకెవరూ చెప్పలేదా ప్రజలు పిచ్చోళ్లు అనుకుంటున్నారా అని సెటైర్లు వేశారు. 


విశాఖ ఉక్కుపేరుతో మరో మోసానికి తండ్రీ కుమారులు బయల్దేరారని.. వీళ్లకు ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందన్నారు విష్ణు. పెట్టుబడులు సేకరిస్తేంటే దాన్ని తరలిస్తారని... అమ్మెస్తరంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 






తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను కూడా మోసం చేయడానికి సిద్ధపడ్డారని విష్ణు వర్దన్ మండిపడ్డారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను ఏం చేస్తున్నారో అందరికి తెలుసని కామెంట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 2024లో లబ్ధి పొంది ఓట్లు వేయించుకునేందుకు మరో సెంటిమెంట్‌తో వస్తున్నారని దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.