Vizag News :  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఐదేళ్ల కిందట విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసులో విచారణ విశాఖ కోర్టులో ప్రారంభమయింది. గతంలో విజయవాడలో జరిగేది. కొత్తగా విశాఖలో ఎన్ఐఏ కోర్టును ఏర్పాటు చేయడంతో అక్కడికి బదిలీ చేశారు.  తాజాగా జరిగిన విచారణలో  వచ్చే నెల 6 తేదీ కి   విశాఖ మూడో ఆదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వాయిదా వేశారు. విచారణ కోసం రాజమహేంద్రవరం జైలు నుంచి విశాఖకు నిందితుడు జనపల్లి శ్రీనివాసరావును తరలించారు. ఆయనను చూసేందుకు కుటుంబసభ్యులు కోర్టుకు వచ్చారు. 


సీఎం జగన్ ఎన్వోసీ ఇవ్వాలని కోరుతున్న  శ్రీనివాస్ తరపు లాయర్  


సీఎం హాజరుకావాలని లేదా బెయిల్ వచ్చేలా ఎన్వోసీ ఇవ్వాలని జనపల్లి శ్రీనివాసరావు  తరఫు న్యాయవాది   విజ్ఞప్తిచేశారు.   జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో ఘటన జరిగింది.  ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న కోడి కత్తి కేసు విచారణ జరుగుతోంది.  నేటికీ నిందితుడు శ్రీనుకు బెయిల్ మంజూరు కాలేదు.  కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే తేల్చిన ఎన్ఐఏ .. చార్జిషీటు  దాఖలు చేసింది.  జగన్ NOC అయినా ఇవ్వాలి, వాదనలైనా వచ్చి వినిపించాలని.. నిందితుడి తరపు న్యాయవాది సలీం కోరుతున్నారు.  కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ చెప్పిందని..  రాజకీయాల కోసమే కేసును వాయిదా వేస్తున్నట్లున్నారన్నని ఆయన అసహనం వ్యక్తం చేసారు.  వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నారేమోనని శ్రీను తరపు న్యాయవాది సలీం అనుమానం వ్యక్తం చేశారు. 


బెయిల్ కోసం ఎదురు చూస్తున్న కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు


ఐదేళ్లుగా జైల్లో ఉన్నా ఇంకా ఎంత కాలం జైలులో ఉండాలో తెలియడం లేదని..  విముక్తి కల్పించాలంటూ జనపల్లి శ్రీనివాసరావు ఇటీవల సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేఖరాశారు.  కేసును జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ విచారించి న్యాయం చేయాలి. న్యాయం చేయాలని అనేక మార్లు కోర్టుకు విన్నవించా. అయినా స్పందన లేకపోవడంతో  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తున్నానని ఆయన వాపోయారు.  శ్రీనివాసరావు  తల్లి సావిత్రి.. గతంలో సీజేఐగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణకు ఇదే విషయంపై లేఖ రాశారు.  విచారణను వేగవంతం చేసి.. కేసును ముగించాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని శ్రీను తరపు లాయర్లు చెబుతున్నారు. 
  
చార్జిషీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ 


వేగంగా విచారణ జరిగిన ఎన్‌ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది.  ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాసరావును పేర్కొన్నారు. చార్జిషీటుతో పాటు నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైల్‌లో రాసుకున్న 22పేజీల లేఖను కూడా కోర్టుకు అందజేశారు. తుది చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ విచారణ కొనసాగుతుందని ఎన్ఐఎ అధికారులు పేర్కొన్నారు. జగన్‌పై దాడి చేసే ముందు రోజు ఎయిర్‌పోర్టు ఫుడ్ కోర్టులో తోటి ఉద్యోగులతో జగన్‌ గురించి శ్రీనివాసరావు చర్చించినట్లు పేర్కొంది.ఈ సందర్భంగా జగన్‌తో సెల్ఫీ తీసుకునే అవకాశం ఇవ్వాలని వారిని కోరినట్లుగా చెప్పింది.ఇందుకోసం వైసీపీలో ఎవరితోనైనా మాట్లాడాలని సహా ఉద్యోగి హేమలతను శ్రీనివాసరావు కోరాడని స్పష్టంచేసింది.సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుందని, అందుకోసం తాను మాట్లాడతానని హేమలత భరోసా ఇచ్చినట్లుగా వివరించింది. పార్టీ నేతలతో కలిసి జగన్‌ వీఐపీ లాంజ్‌లో ప్రవేశించాక.వారికి అల్పాహారం అందించేందుకు శ్రీనివాసరావు ఫుడ్‌ కోర్టు సిబ్బందితో కలిసి లోనికి వెళ్లినట్లుగా చార్జిషీట్ లో స్పష్టం చేసింది.