Salur Ysrcp MLA : ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వారిలో ఒకరు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేతల్లో ఆయన ఒకరు. నాలుగు సార్లు గెలిచారు. కానీ ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ భరోసా లేకుండా పోయింది. ఆయన నియోజకవర్గంలోనే గిరిజన వర్శిటీకి శంకుస్థారన చేసిన సీఎం జగన్... మరోసారి రాజన్నదొరను ఆదరించాలని అక్కడి ప్రజలకు పిలుపునివ్వలేదు. దీంతో వైసీపీలో చర్చ ప్రారంభమయింది. 


జగన్‌కు విధేయుడు రాజన్న దొర                          


2019లో పాదయాత్రలో భాగంగా సాలూరు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగసభలో  రాజన్నదొర పై ప్రశంసల వర్షం కురిపించారు. గిరిజనుడైన రాజన్నదొర నీతిమంతుడని, రూ.30 కోట్లు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చినా పార్టీ ఫిరాయించలేదని కితాబిచ్చారు.  2019 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఆయనేనని కూడా అప్పుడే ప్రకటించారు. అయితే మళ్లీ ఎన్నికల సీజన్ వచ్చే సరికి పెట్టిన బహిరంగసభలో మాత్రం రాజన్నదొర గురించి కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క వరం కూడా ప్రకటించలేదు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడిన సమయంలో డిప్యూటీ సిఎం రాజన్నదొర పక్కనే నిలబడ్డారు. అయినా  పట్టించుకోలేదు.  2024లో జరిగే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా మళ్లీ రాజన్నదొరని ఆశీర్వదించాలని చెప్పకపోవడంతో టిక్కెట్ లేదని వైసీపీ వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి. 


కురుపాం సభలో పుష్పశ్రీవారికి టిక్కెట్  భరోసా                            


ఇటీవల కాలంలో కురుపాం నియోజకవర్గంలో సిఎం జగన్‌ పర్యటించారు. అక్కడ నిర్వహించిన సభలో సిఎం జగన్‌ మాజీ మంత్రి పుష్పశ్రీవాణి గురించి ప్రస్తావిస్తూ ...నున్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పుష్పశ్రీవాణిని మళ్లీ గెలిపించాలని  కోరారు. కానీ సాలూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన సభలో మాత్రం రాజన్నదొర ఊసెత్తని పరిస్థితి కనిపించింది. అధికారపార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రానున్న ఎన్నికలు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టవచ్చునని పలువురు భావిస్తున్నారు.


సర్వేల్లో వ్యతిరేకత వచ్చిందా ?                       


వైసిపి అధిష్టానం   పోటీచేసే అభ్యర్థులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై రహస్యంగా సర్వేలు నిర్వహిస్తోంది. ఐ ప్యాక్ సిబ్బంది నియోజకవర్గాల పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నారు.  నియోజకవర్గ పార్టీపై నియంత్రణ లేకపోవడం, మండలాలు, పట్టణంలో నాయకుల మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాలను చక్కదిద్దడంలో వైఫల్యం, డిప్యూటీ సిఎం, మంత్రి హోదాలో జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే రీతిలో వ్యవహరించకపోవడం వంటివి ఆయనకు మైనస్ అవుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోయినా ఎంపీ టిక్కెట్ ఇస్తారని రాజన్న దొర అనుకుంటున్నరు. అందుకే ఆయన కూడా హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదని చెబుతున్నరు.