Neeraj Chopra Diet:  ఐక్యరాజ్యసమితి గుర్తించిన దాదాపు అన్ని దేశాలు పోటీపడే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో  తీవ్రమైన పోటీని తట్టుకుని  పతకం సాధించాలంటే ఆషామాషీ కాదు. అలాంటిది వరుసగా రెండేండ్ల పాటు ఫైనల్స్‌కు అర్హత సాధించడమే గాక పతకాలు  సాధించిన ఘనుడు నీరజ్ చోప్రా. గతేడాది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం నెగ్గిన  నీరజ్.. ఈ ఏడాది  ఏకంగా స్వర్ణాన్ని ముద్దాడి సీనియర్ స్థాయిలో అన్ని  మేజర్ టోర్నీలలో  పసిడి గెలిచిన అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. ఐదారేండ్లుగా నిలకడగా రాణిస్తున్న  ఇండియన్ గోల్డెన్ బాయ్ ఏం తింటాడు..? అతడి డైట్ ఎలా ఉంటుంది..? వంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం. 


మిగతా క్రీడాకారులతో పోలిస్తే అథ్లెట్లు మరింత ఫిట్‌గా ఉండాలి.   నీరజ్ చోప్రా పోటీపడే ఈవెంట్ జావెలిన్ త్రో..  ఈ విభాగంలో  రాణించాలంటే  కండబలం అవసరం.  దీనికి తోడు జావెలిన్ త్రో‌లో మెరుగైన ఫలితాలు రాబట్టాలనుకునే  అథ్లెట్ల బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ (ఒంట్లో కొవ్వు నిల్వల శాతం) 10 శాతం లోపే మెయింటెన్ చేయాలి.   ఇంత ఫిట్‌నెస్ మెయింటెన్ చేయడానికి నీరజ్ చోప్రా పర్ఫెక్ట్ డైట్ ప్లాన్  పాటిస్తాడు. బాడీ ఫ్యాట్‌ను కంట్రోల్‌లో ఉంచుకుని  మజిల్ గ్రోత్ (కండబలం) కావడానికి నీరజ్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాడు.


కొబ్బరి నీళ్లతో మొదలు.. 


ఇదే అంశంపై ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  నీరజ్ తన డైట్ ప్లాన్ గురించి వివరించాడు.  ఈ టోక్యో ఒలింపిక్ ఛాంపియన్ తన రోజును కొబ్బరి నీళ్లు లేదా తాజా పండ్ల రసంతో ప్రారంభిస్తాడు.  అతడి బ్రేక్ ఫాస్ట్ కూడా చాలా లైట్‌ గానే ఉంటుంది. అల్పాహారంగా నీరజ్.. నాలుగు ఎగ్ వైట్స్, రెండు బ్రెడ్ ముక్కలు, ఒక కప్ దాలియా (పప్పుతో చేసే పదార్థం), కొన్ని పండ్లను తీసుకుంటాడు. 


లంచ్‌లో అవి పక్కా.. 


మధ్యాహ్నం లంచ్‌లో నీరజ్ ఎక్కువ పెరుగన్నానికే ప్రాధాన్యతనిస్తాడు. కొన్ని పప్పుధాన్యాలతో చేసిన  వంటకంతో పాటు గ్రిల్ల్‌డ్ చికెన్, సలాడ్ తీసుకుంటాడు. ట్రైనింగ్స్ ఉన్నప్పుడు నీరజ్.. లంచ్‌లో పలు మార్పులు చేసుకుంటాడు. ఆ సమయంలో ఎక్కువగా తాజా పండ్ల రసాలు,  డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా  ఇష్టపడతాడు. 


డిన్నర్‌లో.. 


రాత్రి పూట  అధిక క్యాలరీల ఆహారానికి నీరజ్ దూరంగా ఉంటాడు. అతడి డిన్నర్ ప్లేట్‌లో సూపర్, ఉడకబెట్టిన కూరగాయలు,  పండ్లు మాత్రమే ఉంటాయి. 


 






ప్రోటీన్ కోసం.. 


అథ్లెట్లు ఫిట్‌నెస్ మెయింటెన్ చేసేందుకు  ప్రొటీన్ కీలక అవుతుంది.  ప్రొటీన్ కోసం నీరజ్ కొన్ని  సప్లమెంట్స్ (ప్రొటీన్ షేక్స్) తీసుకుంటాడు. 2016 వరకూ  నీరజ్ వెజిటేరియన్‌గా ఉండేవాడు.  కానీ ఆ తర్వాత అతడు తన డైట్‌ను మార్చుకుని నాన్ వెజ్‌ను కూడా యాడ్ చేసుకున్నాడు.  అవసరం మేరకు చికెన్‌తో పాటు సాల్మన్ ఫిష్‌ను కూడా తీసుకుంటున్నాడు. 


చీట్ మీల్స్.. 


డైటింగ్‌లో ఉన్నవారు వారంలో గానీ నెలలో గానీ ప్రత్యేక రోజును కేటాయించి  నిబంధనలనన్నింటినీ పక్కనబెట్టి ‘చీట్ మీల్స్’ అని ఏదో ఒకరోజు తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటారన్న విషయం తెలిసిందే. నీరజ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.  అయితే చాలా తక్కువ చీట్ మీల్స్ చేసే  హర్యానా కుర్రాడు.. ఆ రోజు తనకు ఇష్టమైన చుర్మా (హర్యానా లడ్డు) గోల్‌గప్పా (పానీపూరి)లు లాగించేస్తాడు.














ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial