Love Story behind Vizag Taj Mahal: విశాఖ నగరం ఎన్నో చారిత్రిక గాథలకే కాదు మరెన్నో ప్రేమ కథలకూ వేదిక . అలాంటి వాటిలో కొన్ని ఇప్పటికీ వివిధ కట్టడాలు, కావ్యాలు, జానపదాలు, ఇతర కళారూపాల్లో నిలిచిపోయాయి. వాటిలో ముఖ్యమైనది విశాఖలోని కురుపమ్ సెంటర్లో ఉన్న (Taj Mahal of Vizag Kurupam Tomb) "ప్రేమ నివేదన రూపం".
అచ్చం షాజహాన్ - ముంతాజ్‌ల కథే
ఎప్పుడో మరణించిన తన ప్రియ భార్య గుర్తుగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ గురించి అందరికీ తెలుసు. కానీ ఇంచుమించు అదే నేపథ్యం ఉన్న కథ ఒకటి మన తెలుగు నేలపై జరిగిందని చాలామందికి తెలియదు. కురుపాం జమీందార్ వైరిచర్ల రాజ బహదూర్ మరణించిన తన భార్య రాణి నరసాయమ్మ జ్ఞాపకార్థం నిర్మించిన కట్టడం ఆ కథను అజరామరం చేసింది.
బిడ్డకు జన్మనిస్తూ మృతి చెందిన రాణీ లక్ష్మి నరసాయమ్మ
విశాఖ పట్టణంలో స్థిరపడి నగరాభివృద్ధి కోసం చేతికి ఎముక లేకుండా దానాలు చేసిన గజపతుల రాజ వంశానికి చెందిన గోడి నారాయణ గజపతికి ఇద్దరు కుమార్తెలు. వారిలో రెండవ కుమార్తె అయిన లక్ష్మి నరసయమ్మను ఉత్తరాంధ్రలోని కురుపం జమీందార్ వైరిచర్ల వీరభద్ర రాజ బహద్దూర్‌కు ఇచ్చి 1895 మే 19న వివాహం చేశారు. ఆరేళ్ళ వారి అన్యోన్య దాంపత్యం అనంతరం బిడ్డకు జన్మనిస్తూ రాణీ నరసయమ్మ పురిటి మంచం మీదే చనిపోయారు. ఆమె మృతిని తట్టుకోలేని రాజా వైరిచర్ల రాజ బహద్దూర్ తీవ్రంగా కలత చెంది కొంతకాలం ఎవ్వరినీ కలిసేందుకు కూడా ఇష్టపడలేదట. కొంతకాలానికి ఆ దుఃఖం నుండి కోలుకున్న ఆయన 1905లో తన భార్య జ్ఞాపకార్థం విశాఖ నగరంలో ఒక జ్ఞాన విలాస్ పేరిట ఒక కట్టడాన్ని నిర్మించారు.
విగ్రహాన్ని కనుమరుగు చేసిన దుండగులు
తన రాణీ జ్ఞాపకంగా ఈ జ్ఞాన మహల్ ను నిర్మించిన రాజ బహద్దూర్ తన భార్య పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు .ఈ కట్టడంపై హియర్ లైస్ ది బాడీ ఆఫ్ మై డియరెస్ట్ లక్ష్మి అండ్ ది హార్ట్ ఆఫ్ వీరభద్ర రాజు " అని చెక్కించారు. అయితే ఆ అక్షరాలు ఇప్పుడు దాదాపుగా చెరిగిపోయాయి. ఈ కట్టడాన్ని సరిగ్గా పరిశీలిస్తే మధ్యయుగాలనాటి మొఘల్, రాజస్థానీ శైలులతో పాటు యూరోపియన్ పద్ధతులనూ అనుకరించినట్టు కనపడుతుంది. మొత్తం సున్నపురాయితో నిర్మించిన ఈ కట్టడం చుట్టూ లతలూ, గొలుసుల ఆకారాలూ, జంతువుల బొమ్మలూ, వివిధ నాట్యభంగిమలో ఉన్న శిల్పాలూ చెక్కించారు. అయితే వాటిలో కొన్ని కాలగమనంలో మాయమయ్యాయి. అలాగే నిర్మాణం నడిబొడ్డున తన భార్య రాణీ నరసమ్మ విగ్రహాన్ని కూడా స్థాపించారు. కానీ సుమారు 40 ఏళ్ల క్రిందట గుప్త నిధుల కోసం కొందరు దుండగులు ఆ విగ్రహాన్ని నాశనం చేశారని చెబుతారు.
నిత్యాన్నదానాలు చేసిన రాజా
రాజావారు బ్రతికి ఉన్న కాలంలో నిత్యం ఇక్కడికి వచ్చి జ్ఞానం చేసేవారనీ, రోజూ ఐదారు వందల మందికి అన్నదానం చేసేవారని చెబుతారు. ఆ సమయంలోనే దీనికి "ప్రేమ నివేదన రూపం " అని రాజావారు పేరు పెట్టారు. అయితే 2000 సంవత్సరం తరువాత ఆధునిక నాగరికత హోరులో మరుగున పడుతున్న ఈ కట్టడం ప్రాశస్త్యాన్ని గుర్తించిన ఇంటాక్ అనే ఢిల్లీకి చెందిన ఎన్జీవో సంస్థ కొంతకాలం దీని సంరక్షణ బాధ్యతలు చేపట్టింది. అనంతరం కురుపం రాజ వశస్తులైన వైరిచర్ల కిషోర్ చంద్ర దేవ్, ప్రదీప్ చంద్ర దేవ్ లు దీని పోషణ భారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. కొన్నేళ్ల క్రితం వరకూ రోడ్డుపైనుండే కనపడే ఈ కట్టడం ప్రస్తుతం చుట్టూ పెరిగిన చెట్ల వల్ల బయటకి కనపడడం లేదు. మరోవైపు విశాఖలో మరుగునపడుతున్న "ప్రేమ నివేదన రూపం " నిర్మాణాన్ని మళ్లీ గత వైభవ దిశగా సంరక్షిస్తామని రాజవంశీయులు చెబుతున్నారు.
Also Read: Valentine's Day: ప్రేమించమని చెప్పడమే వాలెంటైన్‌కు శాపమైంది, ఉరికొయ్యకు వేలాడాల్సి వచ్చింది
Also read: ఇలాంటి వాగ్ధానాలు చేస్తే ఎవరు మాత్రం పడిపోరు, హ్యాపీ ప్రామిస్ డే