Kandi Kottala Festival: కొండగుడిలో కొత్తల పండగ జలపాతాలు, పచ్చని సోయగాలగుమ్మలక్ష్మీపురం పక్షుల కిలకిలలు, కొండలపై నుంచి జాలువారే నడుమ అడవితల్లి నీడన బతికే ఆదివాసీలు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఆధునిక, సాంకేతిక అంశాలవైపు అంతా పరుగులు పెడుతున్నా.. మన్యంలో అడవి బిడ్డలు మాత్రం తమ వారసత్వాన్ని అందుకొని అడవి తల్లి, ప్రకృతి దేవతలను పూజిస్తూ ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు చాటిచెబుతున్నారు. గిరిజన గూడేల్లో అడవి పుత్రులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించే కందికొత్తల ఉత్సవాలు ప్రారంభం కావడంతో పల్లెల్లో సందడి మొదలయ్యింది.


నేటి నుంచి గిరిజనగూడేలో ఉత్సవాలు


సాధారణంగా అందరికీ పెద్ద పండుగ సంక్రాంతిగా చెప్పుకొంటాం. కానీ ఆదివాసీలు మాత్రం సంక్రాంతి కంది కొత్తల ఉత్సవాలను  వైభవంగా నిర్వహిస్తుంటారు. కొత్త బట్టలు కొనుక్కొని, పిండి వంటలతో ఆనందంగా గడుపుతారు. డప్పుల రాత్రిళ్లు సందడి చేస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో స్థిరపడినవారు సైతం చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


అడవి దేవతలకు పూజలు


ఏజెన్సీలోని గిరిజన ప్రజలకు అటవీ ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. పోడు పనుల్లో భాగంగా అడవుల్లోనే జీవనం సాగిస్తుంటారు. వన్యప్రాణులు, మాదిరిగానే విషసర్పాలతో హాని కలగకుండా.. ఉండాలని కోరుకుంటూ అడవి బిడ్డలు దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఆటవీ ప్రాంతాల్లో సందడితో ఉన్న చెతరమ్మ, గొడ్డలమ్మలను స్వగ్రామాలకు దగ్గరకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు గిరిజనులు చేస్తుంటారు. చీరలతో మొక్కులు చెల్లిస్తారు. ఐదు రోజులపాటు పూజల అనంతరం దేవతలను అటవీ ప్రాంతంలోని ఆయా స్థానాల్లో ఏడాది వరకు భద్రపరుస్తారు.


పండగ తరువాతే పంట


ప్రధానంగా గిరిజనులు కొండ పోడులో సాగుచేసే కంది పంట, ముందుగానే చేతికొచ్చినప్పటికీ ఏజెన్సీలోని గిరిజనులు మాత్రం కనీసం ఒక్క గింజ కూడా నోట్లో పెట్టరు. కంది కొత్తల ఉత్సవాలు తరువాత మాత్రమే కందులతో పాటు గంటెలు, జొన్నలు, సామలు వంటి చిరుధాన్యాలను ఆరగిస్తారు. తొలుత సేకరించిన కందులను అమ్మవారికి బోనాలతో నైవేద్యం పెట్టి, పూజలు ఆనంతరం ఆరగించడం ఆనవాయితీగా వస్తుంది.


ముగ్గురే ప్రధానం


ఉత్సవాల్లో ముగ్గురే కీలకంగా ఉంటారు. దీసరోడు, జన్నోడు, ఎజ్జాడు కీలక పాత్ర పోషిస్తారు. దేవతలను గ్రామాల్లోకి తీసుకురావడం, పూజలు చేయించడం, అనుపోత్సవాలు తరువాత అటవీ ప్రాంతానికి సాగనంపే వరకు బాధ్యత వహిస్తారు. తొలిరోజు అడవి దేవతలైన చెతరమ్మ, గొడ్డలమ్మ, కప్పరమ్మను తీసుకొచ్చి జాకారమ్మ దగ్గరకు చేర్చుతారు. గడప గడపకు తీసుకెళ్లి దర్శించుకుంటారు. కోళ్లు, చీరలు, బంగారు, వెండి కట్టులతో మొక్కులు చెల్లిస్తారు. దేవతలను సమీప గ్రామాలకు తీసుకెళ్లి డప్పుల సందడితో బియ్యం సేకరిస్తారు. వాటితో అనుపోత్స వాలు రోజున సహపంక్తి భోజనాలు చేస్తారు. అనంతరం గొడ్డలమ్మ, చేతరమ్మ, కప్పరమ్మ లను అటవీ ప్రాంతాల్లోని ఆయా స్థానాల్లో భద్రపరుస్తారు. యువతీ, యువకులు, మహిళలు వేషధారణలు ధరించి, డప్పుల సందడితో నృత్యాలు ప్రదర్శిస్తారు.


మన్యం జిల్లా ఏజెన్సీలో గిరిజనులు వారి పండగలు చూస్తే వింతగా కనిపిస్తాయి. మొదటి పండగగా విత్తనాల పండుగ అని కూడా పిలుస్తారు అయితే వీరందరూ కూడా పంటలు బాగా పండాలి ఆరోగ్యంగా ఉండాలి అని కొండ దేవతకు పూజలు చేసి అత్యధిక ప్రసాదాల్ని అక్కడే తీసుకుంటారు. తెల్లవారుజాము నుంచి ఇంటి ముందు ముగ్గులు వేసి కొన్ని ఆహార పదార్థాలు తయారుచేసి కొండ దేవతకు నైవేద్యంగా పెడతారు. వారువాడే వస్తువులన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజలు నిర్వహిస్తారు. అన్నం వండి వచ్చిన గంజితో  వారికి పండే పంటలను పండ్లను అన్ని కలిపి తీర్థముగా తయారుచేసి దాన్ని అక్కడే పుచ్చుకుంటారు. మరికొందరు దేవుడికి నైవేద్యంగా పెట్టి వాటిని అరిటాకుల్లో లేదా గుమ్మడి కాయలో వేసి చిన్న పెద్ద తేడా లేకుండా తాగుతారు. దానివల్ల వారికి ఎటువంటి అనారోగ్యాలు గానీ ఉండవని వారి నమ్మకం. పంటలు బాగా పండి సుఖసంతోషాలతో ఉండాలని డబ్బులు డోలుతో గిరిజన నృత్యాలు చేసుకుంటూ వారి భాషలో పాటలు పాడి సందడి చేస్తారు. బంధువులను కూడా పిలుచుకొని ఎంతో ఆనందోత్సవాలతో ఈ పండగలు నిర్వహిస్తారు.


కుటుంబంలో చనిపోయిన వ్యక్తులు వల్ల ఆత్మలు శాంతించాలని కూడా పూజలు చేస్తారు. అయితే వస్తువులన్నీ కూడా కొండ దేవతకు పెట్టి వారి ఆత్మలను కూడా ఒక రాయి రూపంలో వారు పూజలు నిర్వహిస్తారు. ఇది చూడ్డానికి విడ్డూరంగా ఉన్నా వారు మాత్రం అక్కడ అదే దైవం కింద పూజిస్తారు. అయితే కొండ దేవతను నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని గిరిజనులు చెబుతున్నారు.