తెలంగాణ ఎన్నికల్లో గెలుపు విషయంలో కాంగ్రెస్ పగటి కలలు కంటుందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ఆయన ఆసిల్‌మెట్ట వద్ద గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం (సెప్టెంబరు 29) జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ కి అక్కడ ఏ మాత్రం ఓటు బ్యాంక్ లేదు అని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ మూడు నాలుగు రాష్ట్రాలకే పరిమితం అయ్యింది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే ఆదానీ, అంబానీలు కుబేరులు అయ్యేలా చేసిందని ఆరోపించారు. రాష్ట్రాలను మాత్రం మాత్రం లక్షల కోట్లలో అప్పుల్లో ముంచేశారని అన్నారు. కాంగ్రెస్ దేశంలో కుటుంబ పాలన తీసుకు వచ్చిందని వివరించారు. 


తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన వారు టీఆర్ఎస్ లో చేరడం ఖాయమని, గతంలో 21 మందిలో 16 మంది టీఆర్ఎస్ లో చేరారు అని గుర్తు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఘోర ఓటమి దక్కింది అని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే సాధించింది అని అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బృందం కొంత మంది నాయకులకు కోట్లు ఎర వేసి కాంగ్రెస్ లో చేరమని ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు.


బీసీలు 62 శాతం ఉండగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఐదు శాతంగా ఉన్న రెడ్లనే కాంగ్రెస్ అధిష్టానం సీఎం లు చేసిందని అన్నారు. అంబేడ్కర్, గద్దర్, ప్రజా శాంతి పార్టీ పాలన రావాల్సిన రోజులు వచ్చాయని అన్నారు. వచ్చే నెల రెండో తేదీన సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో బహిరంగ సభను బీసీలు విజయవంతం చేయాలని కోరారు.