Pawan Kalyan: రుషికొండపై జరుగుతున్న తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన పవన్ కల్యాణ్.. రుషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లు అంటిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. కొండలను తవ్వడం, చెట్లు నరికివేయడం, తీరప్రాంతాలు, మడ అడువులను నాశనం చేయడం అనేది దుష్ట పాలకుల లక్షణమని విమర్శలు గుప్పించారు. నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ ప్రభుత్వం రుషికొండను ధ్వంసం చేస్తోందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందని గుర్తు చేశారు. వైసీపీ సర్కారు సమాధానం చెబుతుందా లేక రుషికొండ గ్రీన్ మ్యాట్ పై 151 అడుగుల స్టిక్కర్ ను అంటిస్తారా అంటూ పవన్ సెటైరికల్ ట్వీట్ చేశారు. 


రుషి కొండ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణతో పాటు జనసేన నేత మూర్తి యాదవ్ గతేడాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై పలుమార్లు ధర్మాసనం విచారణ చేపట్టింది. రుషికొండలో 9 ఎకరాల్లో మాత్రమే తవ్వకాలు జరపాలన్న నిబంధనలను వైసీపీ సర్కారు తుంగలొ తొక్కింది. దాదాపు 20 ఎకరాలు తవ్వేసిందని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ క్రమంలో తవ్వకాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలనకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఓ కమిటీని కోర్టు నియమించింది. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ రుషి కొండలో క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రెండు రోజుల క్రితం రుషికొండ తవ్వకాల కేసు విచారణకు వచ్చింది. రుషి కొండకు సంబంధించి నివేదికను కేంద్ర కమిటీ హైకోర్టుకు సమర్పించింది. దీంతో కౌంటర్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. 


వైసీపీ ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన


వైసీపీ సర్కారు, వైసీపీ నాయకులపై తిరుపతి జనసేన పార్టీ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం, నాయకులపై తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ వినూత్న రీతిలో నిరస తెలిపారు. 'మా నమ్మకం నువ్వే జగన్' పేరుతో వైసీపీ ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తున్న విషయం తెలిసిందే. దీనినే అస్త్రంగా వాడుకుంటున్నారు జనసేన నాయకులు. ఒకవైపు 'మా నమ్మకం నువ్వే జగన్' స్టిక్కర్లు అతికిస్తుంటే 'మా నమ్మకం నువ్వే పవన్' పేరుతో స్టిక్కర్లు అతికిస్తున్నారు. సీఎం జగన్ కు కంగ్రాట్స్ అంటూ మరో వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజల ముందు అమాయకుడిలా నటిస్తున్న జగన్ కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఏడీఆర్-ఎలక్షన్ వ్యాచ్ నివేదికలో దేశంలోనే ధనవంతుడైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలిచారని జనసేన నాయకులు గుర్తు చేశారు. 'ఆస్తులు జగన్ కి అప్పులు ప్రజలకి' అంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. 


వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న రోజుల్లో వెనక ఉండి రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శలు చేశారు. ఇప్పుడు సీఎంగా ప్రజల మాటున జైలు శిక్షను తప్పించుకుని జగన్ ఓ గజినీలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కొన్ని వేళల్లో కొందరిని మాత్రమే మోసం చేయగలరని, అన్ని వేళల్లో అందరినీ మోసం చేయలేరని జగన్ కు సూచించారు.