Pawan Kalyan Comments: ఏపీలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతోందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. క్షేత్ర స్థాయి నుంచి బలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కూటమి గెలుపు కోసం పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. అది తన వ్యక్తిగత గెలుపు కాదని.. మనందరి గెలుపు అంటూ పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి నియోజకవర్గాలకు చెందిన జనసేన నేతలతో పవన్ కల్యాన్ సమావేశం అయ్యారు. ఉమ్మడి జిల్లాల నాయకులతో ముఖాముఖి భేటీలు నిర్వహించారు. వీర మహిళా విభాగం ప్రాంతీయ సమన్వయకర్తలతో కూడా పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.


జనసేన కోసం తపించి పని చేసిన ప్రతి ఒక్కరి సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. 2019 తర్వాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉండానని చెప్పారు. ప్రజా రాజ్యం సమయంలో ఉన్న చిన్న పరిచయంతో ఒక నాయకుడికి 2014 తర్వాత టీటీడీ సభ్యుడిగా రెండుసార్లు పదవి ఇప్పించగలిగానని అన్నారు. అప్పటికి ఆయన మన పార్టీలోకి రాలేదని అన్నారు. జనసేన కోసం నిలిచిన ఎవర్నీ తాను మర్చిపోలేనని అన్నారు. ఇప్పటి ఎన్నికల్లో స్థానాలు మాత్రమే కాకుండా.. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక వచ్చే అవకాశాలనూ ద్రుష్టిలో ఉంచుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో, పీఏసీఎస్ లలో, ఇతర కీలక నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానాలు మనకు దక్కుతాయని అన్నారు. తద్వారా అందరీని బలోపేతం చేసి ముందుకు వెళ్దామని తెలిపారు.


మూడింట ఒక వంతు పదవులు దక్కించుకుందామని చెప్పారు. ఏపీకి సుస్థిర పాలన అవసరం అని, అప్పుడే డెవలప్ మెంట్ సాధ్యమని అన్నారు. అలాంటి సుస్థిర పాలన మన కూటమి అందిస్తుందని అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక వేత్తలు, పారిశ్రామిక వేత్తలు కూడా అంటున్నారని చెప్పారు. ఇటీవల తనను కలిసిన పారిశ్రామికవేత్తలు చెప్పిన విషయాలను పంచుకున్నారు.


పార్టీ నిధికి రూ.10 కోట్లు
కూటమి నిర్ణయం అనే ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలను, సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని చేసిందేనని చెప్పారు. వ్యక్తిగతంగా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోనని.. సమష్టిగా నిలిచే విధంగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తానని అన్నారు. పార్టీ బలోపేతం పార్టీ పక్షాన ఎన్నికల నిర్వహణ కోసం రూ.10 కోట్లు తన స్వార్జితాన్ని నిధిగా ఇవ్వనున్నట్లుగా పవన్ కల్యాణ్ ప్రకటించారు.