TDP Chief Chandrababu News: సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దం పేరుతో నిర్వహిస్తున్న సభల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టే రీతిలో మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన చంద్రబాబు.. వీటిపై చర్చకు సిద్ధమా..? అంటూ సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి బూటకపు హామీలన్నీ ఈ వీడియోలో ఉన్నాయంటూ చంద్రబాబు నాయుడు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. నువ్వు చెప్పేవన్నీ నిజాలు అయితే వీటిపై చర్చకు ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు జగన్ కు సూచించారు. బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మవద్దని చంద్రబాబు నాయుడు కోరారు. సిద్ధం పేరుతో రాప్తాడులో నిర్వహించిన సభా వేదికగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన నేపథ్యంలో.. తాజాగా చంద్రబాబునాయుడు దానిపై స్పందిస్తూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన ఆత్మీయుడు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. 


సామాజిక న్యాయానికి నిలువునా శిలువ


సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి, బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసే జలగలా జగన్ తయారయ్యాడంటూ చంద్రబాబు నాయుడు విమర్శించారు. విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసిన జగన్.. ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ కు, జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఇంకా 50 రోజులే మిగిలి ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ను విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని, ఆ నిరుత్సాహంతోనే ఇష్టం వచ్చినట్లు జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుందని టిడిపి అధినేత స్పష్టం చేశారు. బూటకపు ప్రసంగాలు కాకుండా అభివృద్ది పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చించేందుకు రావాలంటూ చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.


దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు కోరారు. 'ప్లేస్, టైం నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా.. దేని మీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ' అని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా చేసిన సవాల్ ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తారో లేదో చూడాలి. ఘాతానికి భిన్నంగా కాస్త ఘాటు అయిన పదజాలంతో చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీల మధ్య మాటలు యుద్ధం జరుగుతోంది.


మొన్న జరిగిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్లీవ్స్ మడత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని కేడర్ కు పిలుపునివ్వగా.. దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు టిడిపి, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడత పెడతారంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. సీఎం వ్యాఖ్యలు స్పందించిన నారా లోకేష్ శంఖారావం సభ వేదికగా కుర్చీని మడత పెట్టి మరి సమాధానమిచ్చారు. రానున్న రోజుల్లో ఈ వ్యాఖ్యల దుమారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నుంచి ఎటువంటి కౌంటర్ వస్తుందో చూడాలి.