Nara Lokesh Comments On Jagan : సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. మండుటెండలో కార్యకర్తలను సెల్ఫోన్ టార్చ్ ఆన్ చేయమంటూ చెప్పిన జగన్ కు చిప్ పోయిందని.. జగన్ చెప్పిన మాటలతో కార్యకర్తలు ఒకరు మొహం ఒకరు చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని లోకేష్ విమర్శించారు. విశాఖ నగర పరిధి ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సదస్సులో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విధానాలపై తీవ్రస్థాయిలో లోకేష్ ధ్వజమెత్తారు.
ఉత్తరాంధ్ర ఊపు అదిరిందని, . ఇక్కడి జీవితాలతో జగన్ ఓ ఆట ఆడారని, రెండు నెలల్లో ప్రజలు జగన్ ను ఫుట్ బాల్ ఆడుకుంటారని లోకేష్ అభిప్రాయపడ్డారు. పౌరుషాల గడ్డ, పోరాటాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర అని, ఏపీకే కాకుండా దేశానికే సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ అని లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు విశాఖను జాబ్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా మారిస్తే... గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా జగన్ మార్చారన్న లోకేష్.. ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మాఫియాను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో విశాఖలో రోజుకో కిడ్నాప్, విధ్వంసం, మర్డర్, రోజుకో భూ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.
సైకిల్ గ్లాస్ విలువ పెత్తందారులకు అర్థం కాదన్న లోకేష్
సిద్ధం సభ వేదికగా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా లోకేష్ తిప్పి కొట్టారు. సైకిల్, గ్లాస్ విలువ పెత్తందారుకు అర్థంకాదని, సైకిల్ సామాన్యుడి చైతన్య రథమని, గ్లాస్ లో సామాన్యుడు టీ తాగుతారన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. రైతు ఆత్మహత్యలకు ఫ్యాన్ ఉపయోగపడిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ యువతను దగా చేసిన ఈ ప్రభుత్వానికి అదే యువత తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని లోకేష్ వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి ఆత్మహత్యలకు ఫ్యాన్ ఉపయోగపడిందని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో 35 వేల మంది ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారని, అందుకే ఫ్యాన్ రెక్కలు విరిచి చెత్త బుట్టలో పడేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. నవరత్నాల పేరుతో నవ మోసాలు చేశారని, జలయజ్ఞం పేరు చెప్పి తట్ట మట్టి కూడా వేయలేదన్నారు. .
అడుగడుగునా మోసం చేసిన జగన్
సంక్షేమ పథకాల అమలు విషయంలో అడుగడుగునా ప్రజలను మోసం చేసుకుంటూ జగన్ వస్తున్నాడని లోకేష్ విమర్శించారు. వందకు పైగా సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ఆరోపించారు. వై నాట్ 175 అంటున్నారని, వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వైనాట్ జాబ్ కేలండర్, గ్రూప్-1,2 పోస్టులు, వైనాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం అని తాను అంటున్నానని, వీటిపై జగన్ సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారని, కానీ సొంత తల్లి, చెల్లి కూడా నమ్మడం లేని వ్యక్తిని మనం ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ అని, బల్లపైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో పది వేసి, బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ తో వంద లాగేస్తున్నారని లోకేష్ విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాల అమలతో అన్ని వర్గాల ప్రజలను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీలో 1400 పీహెచ్డీ సీట్లు అమ్ముకున్నారని, విసి ప్రసాదరెడ్డి పేరు ఎర్రబుక్ లో రాసుకున్నా అని లోకేశ్ స్పష్టం చేశారు.