Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు పవన్ కల్యాణ్ అంటే ఎంతో ప్రేమ. అన్నయ్య అంటే కూడా తమ్ముడికి పంచప్రాణాలు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తన అన్నయ్యం కోసం పవన్ కాళ్లకు బలపం కట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ప్రచారం చేశారు. కానీ తమ్ముడు జనసేన పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అన్నయ్య మాత్రం డైరెక్టుగా ఏనాడు, ఏ టైంలోనూ సపోర్ట్ చేసింది లేదు. ఈమధ్య చిరంజీవి కామెంట్లు చూస్తుంటే తమ్ముడికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవికి జనాల్లో ఉన్న క్రేజే వేరు. మాస్ ఫాలోయింగ్ లో ఆయనే మెగాస్టార్. ఆయన సినిమాల కోసమే కాదు ఆయన మాటలు వినేందుకు ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు. తాజాగా ఆదివారం వాల్తేరు వీరయ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరు చేసిన కామెంట్లు పొలిటికల్ సర్కిళ్లల్లో వైరల్ అవుతున్నాయి. వైజాగ్ అంటే తనకేంతో ఇష్టమని..ఇక్కడే సెటిల్ అవ్వాలని తన చిరకాల కోరికని చిరు చెప్పారు. అంతేకాదు భీమిలికి వెళ్లే దారిలో ఈ మధ్యే స్థలం కొన్నానని..త్వరలో ఇల్లు కట్టుకుని వైజాగ్ పౌరుడిగా ఇక్కడే ఉంటానన్నారు. మెగాస్టార్ చేసిన ఈ కామెంట్ల వెనకు పెద్ద స్కెచ్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చిరు విశాఖ పౌరుడిగా ఎందుకు మారుతున్నారు?
తన తమ్ముడికి మద్దతుగానే ఈ కామెంట్లు చేశారనే చర్చ నడుస్తోంది. ఉత్తరాంధ్రలోని విశాఖపై పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పవన్ కల్యాణ్ కి సపోర్ట్ చేసేందుకే చిరు విశాఖకు షిఫ్ట్ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. వైజాగ్‌లో ఉండి తమ్ముడికి సపోర్టుగా రాజకీయ చక్రం తిప్పొచ్చనే ప్లాన్ ఉందనే ప్రచారం లేకపోలేదు. విశాఖవాసులకు దగ్గరైతే పవన్ కలిసొస్తుందని చిరు భావిస్తున్నట్టు ఈ కామెంట్లతో అర్థమవుతోంది.
విశాఖపైనే పవన్ స్పెషల్ ఫోకస్
జనసేన అధినేత పవన్ ఈ మధ్య ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్ర నుంచే విజయయాత్ర కొనసాగించాలని సంకల్పించారు. ఈనెల 12న శ్రీకాకుళం నుంచే యువశక్తి కార్యక్రమం చేపటుతున్నారు. అయితే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంపై ప్రత్యేక దృష్టి పెట్టారట. గతంలో గాజువాకలో ఓటమి తర్వాత విశాఖపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు జనసేనాని. వచ్చే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన గళం వినిపించారు. ఇటీవల మూడు రాజధానులకు వ్యతిరేకంగా విశాఖలోనే ఆందోళనకు పిలుపునిచ్చారు పవన్. ఇప్పుడు తన అన్నయ్య చిరంజీవి కామెంట్లు పవన్ కు సపోర్టు కోసమేననే టాక్ ఊపందుకుంది. ఆదివారం పవన్-చంద్రబాబు భేటీ తర్వాత చిరు ఈ కామెంట్లు చేయడంతో తమ్ముడికి పరోక్షంగా అన్నయ్య స్టెప్పులు వేస్తున్నట్టు వినిపిస్తోంది.