Chinturu News : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చింతూరు మండలం ఇర్కంపేటలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. నిండు గర్భిణీ కొవ్వాసి కమల(27) రక్త స్రావంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రి చేరారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీశారు వైద్యులు. బిడ్డ చనిపోయాడన్న బాధతో భర్త ఐతయ్య గుండెపోటుకు గురై మృతి చెందాడు. భర్త మృతి చెందిన కొద్ది గంటల్లోనే భార్య కూడా మృతి చెందింది. ఐతయ్య, కమల దంపతులకు నలుగురు సంతానం ఉన్నారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో నలుగురు ఆడ పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ప్రభుత్వం పిల్లలను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైలాన్ పరిశ్రమలో ప్రమాదం జరగగా, ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. వేర్‌హౌస్ బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందారు. మరికొందరికి కాలిన గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అగ్ని ప్రమాదంలో మైలాన్ పరిశ్రమ అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్‌రావు (38), కార్మికులు సంతోష్ మెహతా (40), బిహార్ వాసి రంజిత్ కుమార్ (27) తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర కాలిన గాయాలైన వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయారని పరిశ్రమకు చెందిన వారు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ అగ్ని ప్రమాదంపై ఐడీఏ బొల్లారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చనిపోయిన అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్‌రావు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. ఇద్దరు కార్మికులు బెంగాల్ కు చెందిన పరితోష్ మెహతా, బిహార్ కు చెందిన రంజిత్ కుమార్ చనిపోయారని గుర్తించారు.
నల్లగొండలో ఘోర ప్రమాదం
నల్లగొండ జిల్లా కట్టంగూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలంలోని యరసానిగూడెం వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కట్టంగూరు ఆసుపత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లా ఖిల్లా బజార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై ఖమ్మం తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.