గత ఏడాది నుంచి ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలను ఎలుగుబంట్లు, పులులు భయపెడుతున్నాయి. కొన్ని మండలాల్లో అయితే స్థానికులకు కంటి మీద కునుక లేకుండా చేశాయి. తాజాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు బెంబేలేత్తిస్తుండగా.. భామిని మండలంలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా లోగల భామిని మండలం తాలాడ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఏనుగుల ఘీంకారాలతో ప్రజలు వణికిపోతున్నారు. దీనికి తోడు దొరికిన పంటలు దొరికినట్లు నాశనం చేస్తున్నాయి.
కొన్ని రోజుల కిందట గ్రామశివారు ప్రాంతాలకు వచ్చి అలజడి సృష్టించగా తాజాగా కల్లంలో ధాన్యం రాశులు ఏనుగులు నాశనం చేశాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివారు వరకు వచ్చేస్తుండడంతో ఊరు ఊరంతా కదిలి వాటిని బయటకు పంపించడానికి నానా పాట్లు పడుతున్నారు. ఆ గ్రామానికి ఆనుకుని మామిడి తోటల్లో గత కొన్ని రోజులుగా నాలుగు ఏనుగుల గుంపు మకాం వేసింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో రైతులు పండించే మొక్కజొన్న, కూరగాయలు పంటలు శనివారం నాశనం చేసిన గుంపు ఇప్పుడు విక్రయానికి సిద్ధంగా చేసిన ధాన్యం పై మరోసారి దాడి చేయడంతో బాధిత రైతులు ఆ నష్టాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటలుండడం వంశధార నదితీరం కావడంతో గజరాజులు అక్కడ తిష్టవేసాయి. రాత్రి పగలు తేడాలేకుండా స్వైర విహరం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏనుగులు ఘీంకారాలతో గ్రామస్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని తక్షణమే ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు అటవీ అధికారులు ఉమ్మడి జిల్లా యంత్రాంగాం కృషి చేయాలని కోరుతున్నారు. గత మూడేళ్లుగా మకాం వేసీన ఏనుగుల గుంపు తీవ్రంగా నష్టపోతున్న ప్రభుత్వం ఆదుకోవడంలేదని వారంతా వాపోతున్నారు. తివ్వా కొండలపైకి వెళ్లిన గుంపు తిరిగి వంశధార తీరాన గల తాలాడ తోటలకే వచ్చేస్తుండడంతోనే భయమేస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు.
గత ఏడాది ఫిబ్రవరి నెలలో కౌలురౌతు మన్మధరావు కు చెందిన సోలార్ సిస్టం బోరు ధ్వంసం చేసి లక్షల రూపాయలు నష్టపోయినా పరిహరం అందలేదు. అరటి తోటలు, మొక్కజొన్న పంటలు నష్ట పోయిన పట్టించుకునే వారు లేరని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతుల జాబితాలోకి మాజీ సర్పంచ్ తోపాటు స్థానికులు లక్ష్మీ నారాయణ, భాస్కరరావు, వలురౌతు మన్మధరావు, రామారావు, లక్షమణరావు, సంజీవ్ , ప్రకాశరావు తదితరులు చేరారని గ్రామస్తులు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అదే విధంగా ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు గ్రామాల్లోకి రాకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరారు.
ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల ప్రజలను గత ఏడాది నుంచి పులులు, ఎలుగుబంట్లు ముప్పుతిప్పలు పెట్టాయి. తాజాగా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పులి సంచరిస్తోంది. అసలే కరెంట్ లేని గ్రామాలు కావడంతో రాత్రయితే ప్రజలు బిక్కుమిక్కుమంటూ గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అనంతగిరి మండలం రొంపెల్లి. ఎన్ ఆర్ పురం పంచాయతీ పరిధిలో కరెంటు లేని గ్రామాల్లో గత వారం రోజుల నుంచి సోముల అప్పలరాజు, సోముల రామారావుమూడు ఆవులు పులి దాడిలో మృతి చెందాయి. వారం రోజుల్లో మూడుసార్లు పులి దాడి చేయగా మూడు ఆవులు మృతి చెందాయని వాటి యజమానులు తెలిపారు.