భారత్, యూకే నావికా దళాల సంయుక్త విన్యాసాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది బ్రిటన్ కు చెందిన అతిపెద్ద యుద్ధనౌక హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్. భారత నౌకాదళంతో కలసి క్వీన్ ఎలిజబెత్ చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి.  బంగాళాఖాతంలో జూన్21 నుంచి మూడు రోజుల పాటూ ఈ విన్యాసాలు జరిగాయి. ఇరు దేశాల నావికా దళాలు సమాచారాన్ని ఇచ్చి, పుచ్చుకుని పరస్పర సహకారంతో కార్యకలాపాలు నిర్వహించగలిగే శక్తిసామర్థ్యాలను పెంచుకోవడం కోసం ఈ విన్యాసాలు నిర్వహించారు. మల్టీ షిప్, గగనతలం, సముద్రం, సముద్ర ఉపరితలానికి క్రింది భాగంలో విన్యాసాలు జరిగాయి.




త్వరలోనే ఈ యుద్ధ నౌకలు తిరిగి హిందూ మహా సముద్రంలోకి వెళ్తాయి. అంతకుముందు ఇరు దేశాల నావికా దళాల మధ్య పరస్పర సహకారంతో పని చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా … భారత్-బ్రిటన్ నావికా దళాలు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. ఈ సంయుక్త దళాలకు 10 నౌకలు, రెండు జలాంతర్గాములు, సుమారు 20 విమానాలు, దాదాపు 4,000 మంది సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయ భద్రతకు విఘాతం కల్పించేందుకు ప్రయత్నించేవారికి గట్టి నిరోధంగా ఈ ఉమ్మడి దళాలు నిలవగలవు.




హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ ఐదో తరం ఎఫ్-35బీ లైటనింగ్ మల్టీ రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పరిపుష్టమైంది. దీనిని రాయల్ ఎయిర్ ఫోర్స్, రాయల్ నేవీ, యూఎస్ మెరైన్ కార్ప్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ గ్రూపులో ఆరు రాయల్ నేవీ నౌకలు, ఓ జలాంతర్గామి, ఓ యూఎస్ నేవీ డిస్ట్రాయర్, ఓ నెదర్లాండ్స్ ఫ్రిగేట్, 32 యుద్ధ విమానాలు, 3,700 మంది నావికులు, ఏవియేటర్స్, మెరైన్స్ ఉన్నారు. వీరంతా బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్‌కు చెందినవారు.




ఈ విన్యాసాల్లో బ్రిటిషీ రాయల్ నేవీలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన జగ్జీత్ సింగ్ గ్రెవాల్ భాగమవడం గర్వకారణం. యూకే నేవీలో అతిపెద్ద  విమాన వాహన నౌక హెచ్ ఎం ఎస్ క్వీన్ ఎలిజబెత్ క్వారియర్ స్ట్రైక్ గ్రూప్ లో గ్రెవాల్ క్రూ మెంబర్ గా ఉన్నారు. ఈయన కుటుంబ సభ్యులు దశాబ్దాలుగా బ్రిటీష్-భారత్ లోని సాయుధ దళాళ్లో పలు హోదాల్లో సేవలందించారు. ఐదవతరం విమాన వాహన నౌకలో మెరైన్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న గ్రెవాల్ విమానయాన ఇందనం అత్యున్నత ప్రమాణాల వద్ద పనిచేసేలా బాధ్యత వహించడంతో పాటూ ఫ్లైట్ డెక్ లో ఇంధనాన్ని నింపే విధి కూడా ఆయనదే.  




యూకేలో స్థిరపడిన గ్రెవాల్ కుటంబానికి ఇండియన్ ఆర్మీలో సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆయన తాతయ్య రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ సైన్యంలో పనిచేశారని గ్రెవాల్ తెలిపారు. డిస్పాచెస్, బర్మా స్టార్, ఆఫ్రికా స్టార్ వార్ మెడల్, డిఫెన్స్ మెడల్ ను అందుకున్నార. తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారని, భార్య సోదరుడు-మామయ్య ప్రస్తుతం ఇండియన్ నేవీలో విధిలు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నాడు.




ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన ఉనికిని పటిష్టం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్న బ్రిటన్…ఈ ప్రాంతంలో దేశాలతో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్‌ను, దాని టాస్క్ గ్రూప్‌ను హిందూ మహా సముద్రానికి పంపించింది. తదుపరి మోహరింపులో ఈ టాస్క్ గ్రూపు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి వెళ్ళబోతోంది.