తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో మరో రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్‌ కూడా ఉంది. అందుకే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్చరించింది.


అల్పపీడనం కారణంగా ఈ రోజు, రేపు కోస్తాలోని కొన్ని చోట్ల భారీ, ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


భారీగా చేరుతున్న వరదతో.. జలాశయాలు పరవళ్లు తొక్కుతున్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ లో నీటిమట్టం పెరుగుతోంది.  ఎగువ ప్రాంతాల్లోనూ పడుతున్న వానలతో.. జలాశయాలకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 68,491 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా.. 12,713 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 844.90 అడుగులుగా నమోదైంది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటినిల్వ 69.90 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు.


నాగార్జునసాగర్ జలాశయానికి వరద వస్తోంది. ఇన్‌ఫ్లో 28,815 క్యూసెక్కులుగా.. ఔట్‌ప్లో 972 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 534.80 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటినిల్వ 312 టీఎంసీలకుగాను.. ప్రస్తుతం 177.66 టీఎంసీల నీరు చేరింది. 


జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 58,600 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 66,090 క్యూసెక్కులుగా నమోదైంది. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.325 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది.


నిర్మల్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా దిలావపూర్ మండలంలో 24.7సెంటీమీటర్ల వర్షం పడింది. 99 చోట్ల 7 నుంచి 20సెంటీమీటర్ల కుండపోత వర్షం పడింది. స్వర్ణ ప్రాజెక్ట్ గేట్లు తెరిచారు. వానల ధాటికి ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర జలపాతం ఉగ్రరూపం దాల్చింది. గోదావరిపై ఉన్న ఎస్ఆర్ఎస్పీకి దాదాపు 70వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.


గోదావరినదిపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 62వేల 312క్యూసెక్కులు ఉండగా.. 10గేట్లు ఎత్తి 54వేల 590క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 20వేల 17టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.64టీఎంసీలు ఉంది. ఎస్ఆర్ఎస్పీకి కూడా వరద కొనసాగుతోంది.


మరో రెండు రోజుల పాటు వానలు కురుస్తాయన్న.. వాతావరణ శాఖ సూచనలతో  ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాలకు, తీర ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించింది.  విశాఖకు-2, పోలవరం దేవీపట్నానికి-2, భద్రాచలం-1, కర్ణాటక-4 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెళ్లాయి. పలు ప్రాంతాలకు వెళ్లేందుకు మరో 4 బృందాలు సిద్ధంగా ఉన్నాయి.


 


Also Read: Kisaan Parliament: ఎండ, వాన లెక్కేలేదు.. రద్దు చేసేవరకు తగ్గేదే లేదు!