ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అసని తుపాను.. పదో తేదీ నాటికి తీ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం సాయంత్రానికి ఇది ఉత్తరకోస్తాంధ్ర, ఒడిశా తీరానికి సమీపానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అందుకే దీని ప్రభావం ఉత్తర కోస్తాపై ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా కూల్ అయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అసని తుపాను కారణంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం పడింది. వర్షాల కారణంగా జీడి,మామిడి, పనస పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన పంట నేల రాలింది. ఇది రైతులకు తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. 






అసని తుపాను కారణంగా 10, 11 తేదీల్లో కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని కూడా ఐఎండీ పేర్కొంది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచిస్తోంది. 10వ తేదీకి కాకినాడ తీరానికి సమీపానికి రానున్న అసని తుపాను ఎక్కడా తీరం దాటదని... సముద్రంలోనే బలహీన పడనుందని ఐఎండీ వెల్లడించింది. 


నిన్న సాయంత్ర గుంటూరులో ఈదురు గాలులు దుమారం రేపాయి. హోర్టింగ్స్‌,  ఫ్లెక్సీలు తెగిపడ్డాయి. అవి విద్యుత్ తీగలపై పడటంతో షాట్ సర్క్యూట్ అయింది. దీని కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 


తుపాను కారణంగా ఏపీలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. జిల్లాలో డివిజన్, మండల స్థాయిలో అన్ని శాఖల సిబ్బంది (రెవెన్యూ, EPDCL, RWS, R&B, ఫైర్, పోలీస్, ఫిషరీస్, ఆల్ GSWS సిబ్బంది, పంచాయత్ రాజ్. DPO & పంచాయితీ సెక్రటరీలు) 08942-240557 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తదుపరి సూచనలు అందించే వరకు  కంట్రోల్ రూమ్ 24x7 పని చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 


తీరప్రాంత గ్రామాలను అప్రమత్తం చేయాలని తుఫాను సమయంలో మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. సిబ్బంది, అధికారులు అందరూ జిల్లా ప్రధాన కేంద్రంలో అందుబాటులో ఉండాలన్నారు. అధికారులకు, సిబ్బందికి సెలవులు మంజూరు చేయొద్దని ఆదేశించారు.