Asani Cyclone Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ఏపీ సహా దేశంలోని పలు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. అసని తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఏపీలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. వచ్చే 24 గంటల్లో ఈ తుపాను మరింత బలపడవచ్చవని వాతావరణశాఖ అంచనా వేసింది. తుపాను ఆంధ్ర లేదా ఒడిశా తీరాలను తాకే అవకాశం ఉందని తెలిపింది.






మే 10 తర్వాత బలహీనపడే అవకాశం 


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారింది. దీనికి అసని అని పేరుపెట్టారు. తుపాను ప్రభావంతో గంటకు 16 కి.మీ వేగంతో విశాఖపట్నానికి ఆగ్నేయంగా 970 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. ఒడిశా పూరీకి 1030 కి.మీ దూరంలో తుపాను ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్యదిశగా కదులుతున్న అసని తుపాను రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనుందని తెలిపింది. మే 10వ తేదీ వరకు కొనసాగి ఆ తర్వాత తుపాను బలహీనపడే అవకాశం ఉందన్నారు. గంటకు 80 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని పలు జిల్లాల్లో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీచేశారు.






ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు


తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల్లో మంగళవారం నుంచి భారీ గాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం 5:30 గంటలకు అండమాన్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమాన 380 కి.మీ దూరంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో 'అసాని' తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 10 సాయంత్రం వరకు వాయువ్య దిశగా కొనసాగుతుంది.