GVL Narasimha Rao: విశాఖపట్నం ఎయిర్ పోర్టు రన్ వే రీ సర్ఫేసింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు శుక్రవారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమానే‌ను కోరారు. ఇండియన్ నేవీ నియంత్రణలో ఉన్న విశాఖపట్నం విమానాశ్రయంలో చేపట్టనున్న ప్రతిపాదిత రన్‌వే రీ సర్ఫేసింగ్ కారణంగా నవంబర్ 15, 2023 నుండి ఏప్రిల్ 1, 2024 వరకు రాత్రి 9.00 నుంచి ఉదయం 8.00 గంటల మధ్య రన్‌వేని మూసివేయాలనే నిర్ణయం విశాఖ వాసులకు చాలా ఇబ్బందికరమని చర్య అన్నారు. నాలుగు నెలల పాటు ఎయిర్‌పోర్ట్ రన్‌వే మూసివేతతో వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. రన్‌వే మూసివేత సమయంలో పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతారని, ఈ విషయంలో రక్షణ మంత్రి, రక్షణ కార్యదర్శి జోక్యం చేసుకోవాలని జీవీఎల్ కోరారు. 


ఆధునిక పద్ధతులు మరియు సాంకేతికతలను అనుసరించడం ద్వారా విశాఖపట్నం విమానాశ్రయంలో పునరుద్ధరణ పనుల వ్యవధిని బాగా తగ్గించవచ్చని జీవీఎల్ అన్నారు. హైదరాబాద్‌, పూణే విమానాశ్రయాల్లో ఆధునిక పద్ధతులు, సాంకేతికతతో నెలరోజుల వ్యవధిలో పునరుద్ధరణ పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. విశాఖపట్నంలో 4.5 నెలల కంటే చాలా తక్కువ వ్యవధిలో పునరుద్ధరణ పనులు పూర్తి చేయవచ్చని రక్షణ మంత్రి, కార్యదర్శిని జీవీఎల్ కోరారు. పూణే విమానాశ్రయంలో రన్‌వే కొంత  భాగాన్ని రికార్డు సమయంలో మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (MES) 14 రోజులలో పూర్తి చేసిందనీ, అంతకుముందు ఇదే పనికి 35 రోజులు పట్టేదన్నారు. తద్వారా విమానశ్రయ కార్యకలాపాలను త్వరగా ప్రారంభించడంలో పై విధానం సహాయపడిందని ఎంపీ జీవీఎల్ రక్షణ మంత్రికి సమర్పించిన లేఖలో తెలియచేశారు.


హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రీసర్‌ఫేసింగ్ పనులను త్వరగా పూర్తి చేయల్సిన అవసరం గురించి ఎంపీ జీవీఎల్ ప్రస్తావిస్తూ.. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్, GIAL, హైదరాబాద్ రన్ వే మొదటి దశకు మూడు నెలల సమయం పట్టేదని, కానీ కేవలం 15 రోజులలో పూర్తి చేసిందని, కొత్త ఎయిర్‌పోర్ట్ గ్రేడ్ స్టీల్ గార్డ్ (AGSG) టెక్నాలజీని ఉపయోగించడంతో రన్‌వేకి ప్రత్యేక రక్షణ విధానాన్ని వర్తింపజేయడం ద్వారా, ఇప్పటికే ఉన్న తారు పేవ్‌మెంట్ ఉపరితలాలను సంరక్షించడానికి, పొడిగించడానికి ఉపయోగపడుతుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు.  ఆయా కొత్త పద్ధతులు రన్ వే ను కొత్తగా వేగంగా పునరుద్ధరించేందుకు దోహద పడ్డాయన్నారు. ఇదే తరహాలో విశాఖలోను రన్ వే రీ సర్ఫేసింగ్ పనులు చేపట్టాలని కోరారు.


విశాఖ విమానాల రాకపోకల షెడ్యూల్‌ అంతరాయాన్ని తగ్గించడానికి, రీసర్ఫేసింగ్ పనుల కోసం ఎయిర్‌పోర్ట్ రన్‌వే మూసివేసే సమయాన్ని రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే కుదించాలచి రక్షణ మంత్రి, రక్షణ కార్యదర్శిని జీవీఎల్ అభ్యర్థించారు. అనంతరం దీనిపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, రక్షణ మంత్రి, రక్షణ శాఖ కార్యదర్శి ఇద్దరూ సానుకూలంగా స్పందించారని, విశాఖ ఎయిర్‌పోర్టులో రీసర్‌ఫేసింగ్ పనులు త్వరగా పూర్తయ్యే విషయాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నానని, విశాఖ, ఉత్తరాంధ్ర ప్రయాణికులు, వ్యాపారులకు అసౌకర్యం తగ్గించేందుకు కృషి చేస్తానన్నారు.