నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన తప్పులను బయటకు తీసుకొచ్చినందుకే చంద్రబాబును జైలుకు పంపారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేశ్ ములాఖత్ అయ్యారు. ప్రజల తరపున నిరంతరం పోరాటం చేసినందుకు దొంగ కేసు బనాయించి 28 రోజులుగా జుడిషియల్ రిమాండ్ కు పంపారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, నిరుద్యోగ యువతి యువకుల తరపున పోరాటం చేసినందుకే చంద్రబాబును జైలుకు పంపారన్నారు. టీడీపీ-జనసేన కలిసి సంయుక్తంగా కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేస్తామని, కమిటీ సూచనలతో ముందుకెళ్తామని చెప్పారు. టీడీపీ పోరాటం ఆగలేదన్న లోకేశ్, 175 స్థానాల్లో నిరసన చేపడతామన్నారు. గడప గడపకు ‘బాబుతో నేను’ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. పాదయాత్ర, ఇతర కార్యక్రమాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
న్యాయం జరగడానికి ఆలస్యం అవొచ్చు కానీ...
న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ, తమ వైపే ఉంటుందని లోకేశ్ అన్నారు. చంద్రబాబు ఏనాడూ తప్పు చేయలేదని, రిమాండ్‌లో ఉంచినా ఆయన అధైర్య పడలేదని స్పష్టం చేశారు. పోరాటం ఆపవద్దు, శాంతియుతంగా పోరాడాలని తమతో చెప్పారని లోకేశ్ వెల్లడించారు. న్యాయం గెలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని, న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును రిమాండ్ కు పంపారన్నారు.
రోజుకో మాట మారుస్తున్నారు
చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు 3వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారని, తర్వాత 370 కోట్లని మాట మార్చారని విమర్శించారు. కేవలం కక్ష సాధింపుతోనే చంద్రబాబును జైలుకు పంపారని అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పని చేశారని అన్నారు. సైబరాబాద్ కు పునాది వేసింది, పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులు పూర్తి చేసింది కూడా చంద్రబాబేనన్నారు. శనివారం రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్‌లైట్లతో ప్రజలు సంఘీభావం తెలపాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. తమ కుటుంబం మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చిందన్న ఆయన, తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తామన్నారు.
‘కాంతితో క్రాంతి’ నిరసన
మరోవైపు ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రేపు రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి, దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించాలని పిలుపునిచ్చారు. వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ‘కాంతితో క్రాంతి’ పేరిట కార్యక్రమం పేరుతో నిర్వహించే కార్యక్రమంలో . ‘బాబుతో నేను’ అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు, టార్చ్ లైట్లు.. వీటిలో వేటినైనా తీసుకుని వెలుగు చూపించాలని నారా లోకేష్ అన్నారు. 5 కోట్లు ఆంధ్రులు ఒక్కటిగా 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు నిరసన తెలియజేద్దామని పిలుపునిచ్చారు బ్రాహ్మణి. తాడేపల్లిలోని జగనాసురుని కళ్లు బైర్లు కమ్మేలా కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు.