ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు కసిరెడ్డి నారాయణరెడ్డి వెల్లడించారు. తనతో పాటు ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచులు, ఇతర నేతలు కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలని, నిరుద్యోగం లేకుండా పోవాలని యువత కోరుకుందన్నారు నారాయణరెడ్డి. కల్వకుర్తి నియోజకవరంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్న ఆయన, ప్రాజెక్ట్ కు కల్వకుర్తి పేరు పెట్టారు తప్ప నీళ్ళు మాత్రం పారలేదని విమర్శించారు. రైతుల నుంచి భూమిని సమీకరించినా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదన్నారు. భూములు పోయాయన్న కసిరెడ్డి నారాయణరెడ్డి, నష్టపరిహారంపై ఎన్నో సార్లు అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 


ఎమ్మెల్సీ పదవి ఉన్నా ఏం చేయలేకపోయా
కల్వకుర్తి ప్రాజెక్టు కోసం భూములు పోయినా, ఆ కాలువ ద్వారా నీళ్లు మాత్రం రాలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి. భూములు కోల్పోయిన రైతులకు రైతుబంధు రావడం లేదన్నారు. తాను పదవ తరగతి చదువుకున్న పాఠశాలలోనే జూనియర్ కాలేజ్ నడుస్తోందని, డిగ్రీ కాలేజ్ ఇప్పటికీ ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవి ఉండి కూడా కల్వకుర్తికి ఏమీ చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ లో ఉందన్నారు కసిరెడ్డి నారాయణరెడ్డి. ఆ పార్టీలో ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని, తాను అక్కడ అసహాయ నేతగా మిగిలిపోయానని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చిందన్న ఆయన, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజలకు పనికొస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కల్వకుర్తి ప్రజలే కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారని, గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా వారిదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే, కల్వకుర్తి అభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తానన్నారు. 


కేసీఆర్ ఏమన్నా బాహుబలి నా ? -పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
మమ్మల్ని మరుగుజ్జులు అంటారా ? కేసీఆర్ ఏమన్నా బాహుబలి నా ? అద్దంలో ముఖం చూసుకోవాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. తెలంగాణలో బిల్లా, రంగాలు తిరుగుతున్నారని విమర్శించారు.  చెప్పులు వేసుకునే, ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసిందని గుర్తు చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో అమలు చేస్తున్న పథకాలు, తెలంగాణలో అంతటా ఎందుకు అమలు చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హరీశ్ రావు, కేటీఆర్ చిత్త కార్తె కుక్కల్లా రాష్ట్రంలో తిరుగుతున్నారని విమర్శించారు. 


బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలకు 36 సీట్లే-రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా సర్వేలు వస్తున్నాయని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు 36 సీట్లు వస్తాయని, మిగిలిన సీట్లన్నికాంగ్రెస్ పార్టీవేనని చెప్పుకొచ్చారు. సామాజిక వర్గాల నుంచి వస్తున్న అంశాలను పరిశీలించి టిక్కెట్లు ఇస్తామన్నారు. రాని వారికి ఇతర పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని టీపీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో బీఆర్ఎస్ దోపిడీ చేసిందన్నారు రేవంత్ రెడ్డి. అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ నిర్మాణం వరకు చేసిన ఖర్చుకు, పిలిచిన టెండర్లకు పొంతన లేదన్నారు. రూ.400 కోట్లతో సెక్రటేరియట్ నిర్మాణమని చెప్పి రూ.1200 కోట్లు ఖర్చు చేశారన్నారు.