- పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ
- గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానం
- సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున ఆహ్వానించిన అమర్నాథ్
విశాఖపట్నం: విశాఖలో వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి పారిశ్రామిక ప్రముఖులు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారు. మరింతమంది పారిశ్రామిక దిగ్గజాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరఫున రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆహ్వానాలు అందజేస్తున్నారు. 


ఇందులో భాగంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని ఏపీ మంత్రి అమర్నాథ్ బుధవారం స్వయంగా కలుసుకున్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు హాజరు కావలసిందిగా అంబానీని ఆహ్వానించారు. అదేవిధంగా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ను, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను మంత్రి అమర్నాథ్ కలుసుకొని పెట్టుబడి సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు అందజేశారు.






మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఆహ్వానితుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల ఉన్నారు. ఏపీ ప్రభుత్వం మార్చి 3, 4 తేదీలలో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ ను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి 15 మంది కేంద్ర మంత్రులు, 15 మంది ముఖ్యమంత్రులు, 44 మంది ప్రపంచ పారిశ్రామికవేత్తలు, 53 మంది భారతీయ పరిశ్రమల ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులను ఆహ్వానిస్తున్నారు. 






ఆహ్వానితుల జాబితాలో ఎవరున్నారంటే.. 
విశాఖలో జరగనున్న సమ్మిట్‌ ఆహ్వానితుల జాబితాలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్, సామ్‌సంగ్ ఛైర్మన్, సీఈఓ ఓహ్-హ్యున్ క్వాన్ కూడా ఉన్నారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రేజ్, రిషద్ ప్రేమ్‌జీ, ఎన్. చంద్రశేఖరన్ వంటి భారతీయ పరిశ్రమ దిగ్గజాలు ఆహ్వానించారు. ఈ సమ్మిట్ "భవిష్యత్తు కోసం సిద్ధమయ్యే లక్ష్యంతో" అనే నినాదంతో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ  ఈవెంట్‌కు హాజరు కావాలని "మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి" "మాతో కలిసి పని చేయమని" అందరికీ ఆహ్వానాన్ని అందించారు. 2019 మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ప్రభుత్వం వివిధ దేశాల నుంచి పెట్టుబడులు కోరుతూ విజయవాడలో కార్యక్రమాలు నిర్వహించింది.


అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, పరిశ్రమ సంఘాలు, వాణిజ్య సంస్థలను దీర్ఘకాలిక భాగస్వామ్యం చేసేందుకు ఈ సమ్మిట్  వేదిక కానుందన్నారు. ఈవెంట్‌లో బిజినెస్-టు-బిజినెస్ (B2B) , గవర్నమెంట్-టు-బిజినెస్ (G2B) సమావేశాలు,  గ్లోబల్ లీడర్‌లకు అవకాశాలను ప్రదర్శించడానికి సెక్టార్- ప్లీనరీ సెషన్‌లు ఉంటాయి.