Global Investors Summit 2023: విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 నేడే జరగనుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సులో రాష్ట్రంలో 14 కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఉంది. మన దేశం నుంచే కాక విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నేడు (మార్చి 3) ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఇప్పటికే నిన్ననే ఆయన విశాఖకు చేరుకుని, ఏర్పాట్లపై అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమరనాథ్ సభా స్థలి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్పొరేట్ ప్రముఖులు విమానాశ్రయం నుంచి నేరుగా సభా స్థలికి చేరుకునేందుకు మూడు హెలిపాడ్స్‌ను సిద్ధం చేశారు.
ఈ 14 రంగాలే కీలకం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మెరుగైన అవకాశాలు ఉన్న 14 రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ రంగాలకు చెందిన కేంద్ర మంత్రులు కూడా సదస్సుకు రానున్నారు. పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, హెల్త్‌కేర్ అండ్ మెడికల్ ఎక్విప్‌మెంట్, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యుటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్ అండ్ అప్పరెల్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్ తదితర రంగాలపై ఫోకస్ చేసింది.
ఈ సదస్సు కోసం ఇప్పటికే నిన్న సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం బస కోసం రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు.
నేటి షెడ్యూల్ ఇదీ..
Global Investors Summit 2023 First Day Schedule: నేడు (మార్చి 3) ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. తర్వాత వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు 118 స్టాల్స్‌తో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్, కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభిస్తారు. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.50 వరకు ఐటీ, పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, రెన్యూవబుల్ ఎనర్జీ- గ్రీన్ హైడ్రోజన్, వాహనరంగం- ఎలక్ట్రిక్ వాహనాలు, స్టార్టప్‌లు, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం-ఆహారశుద్ధి, ఏరోస్పేస్-డిఫెన్స్, ఆరోగ్య రంగం- వైద్యపరికరాలు తదితర రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చాగోష్ఠులు జరుగుతాయి. ఇదే సమయంలో పలువురు పారిశ్రామిక ప్రముఖులతో సీఎం, రాష్ట్ర మంత్రులు సమావేశాలు చేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేస్తారు.రాత్రికి సాగర తీరంలోని ఎంజీఎం పార్కులో పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులకు ముఖ్యమంత్రి తరపున విందు కార్యక్రమం ఉంటుంది.