Ganta Srinivasa Rao: చందనోత్సవం నిర్వహణపై జ్యుడీషియల్ కమిటీ వేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చందనోత్సవం నిర్వహణలో మొత్తంగా ఏపీ ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. సాధారణ భక్తులకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా టీడీపీ హయాంలో పని చేసేవాళ్లమన్నారు. సింహాచలం వంటి అతిపెద్ద క్షేత్రానికి పూర్తి స్ధాయి ఈఓ లేకపోవడం ఏంటి అని ప్రశ్నించారు.


ద్వారకా తిరుమలకు ఈఓను ఇక్కడ ఇన్చార్జ్ గా ఎలా వేస్తారని ప్రశ్నించారు. సాక్షాత్తు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామే అసహనానికి గురయ్యారంటే అక్కడి పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు. అంతరాలయ దర్శనం అనువంశిక ధర్మకర్తలకు మాత్రమే ప్రవేశం ఉండాలని కమిటీ చెప్పిందన్నారు. చందనోత్సవం లాంటి ఒక్క రోజు ఉత్సవాన్నే సరిగ్గా నిర్వహించలేనంత చేతకాని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇది క్షమించరాని విషయం అంటూ చెప్పుకొచ్చారు. 






విచారణ పేరుతో కమిటీ వేస్తే సరిపోదని‌ దీనికి జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కమిటీకి కాల పరిమితి కూడా నిర్ణయించాలి అన్నారు. ప్రభుత్వం మనస్సు పెట్డి చేయకపోతే ఎలాంటి దుస్ధితి ఏర్పడుతుందో స్వయంగా చూసినట్లయిందని అన్నారు. మొన్న చంద్రబాబుపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డే లాంటిదన్నారు. దాడులను ఎవరూ ప్రోత్సహించారో వారిని గుర్తించి కేసు నమోదు చేయాలన్నారు.


మాజీ మంత్రి బండారు సత్యనారాయాణ మూర్తి మాట్లాడుతూ.. చందనోత్సవం వైఫల్యాలకు దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉత్సవాలు చేస్తున్నారన్నారు. పొరుగున ఉన్న ఒడిశా భక్తులు సింహాచలానికి అత్యధికంగా వస్తారన్నారు.‌ వారి దగ్గర ఏపీ పరువు పోయిందని చెప్పారు. తెలంగాణా నుంచి ఇంద్ర కరణ్ రెడ్డి వచ్చి ఇరుక్కుపోయారని.. దర్శనం అయ్యిందో లేదో తెలియదన్నారు. యర్రగొండపాలెం ఘటనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఎన్.ఎస్.జి అధికారిపై దాడి జరిగినందుకైనా అమిత్ షా స్పందించాల్సిన అవసరం ఉందిని చెప్పారు. సమావేశంలో ఉత్తర నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ చిక్కాల విజయ బాబు, కార్పొరేటర్లు పీవీ నరసింహ, బల్ల శ్రీనివాస్ రావు, 98 వార్డు అధ్యక్షులు పంచదార్ల శ్రీను  తదితరులు పాల్గొన్నారు.



స్వరూపానందేంద్ర తీవ్ర అసహనం


విశాఖపట్నంలో ఏడాదిలో ఒక్క రోజు జరిగే సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లు చాలా దారుణంగా ఉన్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదల ఆరాధ్య దైవం అయిన సింహాద్రి అప్పన్నను సామాన్య భక్తులకు దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను గుంపులుగా పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని విమర్శించారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హజరయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈరోజు తాను ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానని చెప్పారు. కొండ కింది నుంచి పై వరకు వాహనాల రద్దీ ఏర్పడిపోయిందని, దానికి జవాబు చెప్పేవారే లేరని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఇంఛార్జి ఈవోతో ఎలా ఉత్సవాలు జరిపిస్తారని ప్రశ్నించారు.