Ganta Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు సోషల్ మీడియా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా బుధవారం వైసీపీ ప్రభుత్వం పాలనపై విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో దసరా, దీపావళి, రంజాన్ లాంటి ముఖ్యమైన పండుగలకు వారం ముందే ఉద్యోగులు జీతాలందుకునేవారని, వైసీపీ ప్రభుత్వంలో పరిస్థితి మారిపోయిందన్నారు. జగనన్నా పండగొస్తోంది.. మా జీతాలు ఇవ్వన్నా.. మమ్మల్ని కరుణించన్నా అనే స్థితికి దిగజారిపోయిందన్నారు. అమ్మో ఒకటో తారీఖు అనేది పాత మాట అని, ఇప్పుడు ఆ తేదీనే మర్చిపోయిన రోజులు వచ్చాయన్నారు. 






వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటో తేదీన జీతాలు పడిన సంఘటనలు అరుదుగా ఉన్నాయన్నారు. గతంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తేదీ ఉదయాన్నే జీతం పడినట్లు మెసేజ్ వచ్చేదని, జగన్ వచ్చాక ఈ లెక్క మారిపోయిందన్నారు. జీతం ఎప్పుడు వస్తుందో తెలియదని, ఏ తేదీన వస్తుందో తెలియదని, అంతా అయోమయం, జగన్మాయగా మారిపోయిందని విమర్శించారు. నెల నెలా ఈఎంఐలు ఎలా చెల్లించాలో తెలియక ఉద్యోగులు లబోదిబో మంటున్నారని అన్నారు. 2019లో రాష్ట్రానికి జరగకూడని నష్టమే జరిగిపోయిందని, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పరిస్థితి మింగలేక, కక్కలేక, అనేలా తయారైందన్నారు. రాష్ట్రంలోని విద్యావంతులు ఆలోచించాలని, విజన్‌కు ఉన్న విలువ, విధ్వంసం తెచ్చే వినాశనం ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. 2024లో ఏపీ భవిష్యత్‌కు యువత దిక్సూచిలా ముందుండాలని, రాష్ట్రాన్ని రక్షించుకోవాలని గంటా శ్రీనివాసరావు ట్వీట్‌ చేశారు. 


గతంలోనూ డీఎస్సీపై విమర్శలు
గత చాలా కాలంగా గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల డీఎస్సీ నిర్వహణను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతగా హామీల వర్షం కురిపించిన జగన్, సీఎం అయ్యాక 4 ఏళ్లు దాటినా వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది మెగా డీఎస్సీ, జనవరి 1న జాబ్ క్యాలెండర్ వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో 2, 3 రోజుల్లో 'డీఎస్సీపై గుడ్ న్యూస్' అని మంత్రి బొత్స చెప్పారని గుర్తు చేశారు. 'ఆ 2, 3 రోజులు గడిచిపోయాయని మరి గుడ్ న్యూస్ ఎక్కడ.?' అంటూ ట్విట్టర్ వేదికగా గంటా నిలదీశారు.


డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు.?
'డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు.? టెట్ ఎప్పుడు నిర్వహిస్తారు.? రాత పరీక్ష ఎప్పుడు.? అసలు ఎన్నికలు పూర్తయ్యే సమయానికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారా.?' అంటూ గంటా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల వేళ హడావిడిగా నిర్ణయాలు తీసుకుని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. 'నిరుద్యోగులను ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారని.?' నిలదీశారు. కనీసం 1998, 2008లో డీఎస్సీలో ఎంపికైన కాంట్రాక్టు ఉద్యోగులనైనా రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞుప్తి చేస్తున్నట్లు చెప్పారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 9,061 పోస్టులతో, 2018లో 7,729 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించామని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. 2024లో టీడీపీదే అధికారమని, నిరుద్యోగుల భవిష్యత్తుకు ఏం ఢోకా లేదని అన్నారు.