అల్లూరు జిల్లా చింతపల్లి సమీపంలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. వారు ఏకంగా పోలీసులకే చుక్కలు చూపించారు. పుష్ప సినిమా తరహాలో గంజాయి తరలిస్తుండగా, పోలీసులకు దొరక్కుండా పారిపోయారు. దీంతో సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లర్లను పోలీసులు వెంటాడారు. ఆదివారం అర్ధరాత్రి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అటుగా వస్తున్న బొలెరో వాహనం పోలీసులపై వేగంగా రావడం ప్రారంభించింది. గంజాయి స్మగ్లర్లు వాహనాన్ని ఆపకుండా గంజాయి బ్యాగులను రహదారిపై పడేశారు. మార్గ మధ్యలో బొలెరో వాహనం వదిలేసి స్మగ్లర్లు పరారీ అయ్యారు. దాదాపు 980 కేజీల గంజాయిని ఒడిశా పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఈ కేసును ఒడిశా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.