ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ... తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబును  అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నాయి. పోలీసులు కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆందోళనలకు  పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నారు. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


విశాఖలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిని పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. సింహాచలం వరకు కాలినడకన వెళ్తూ.. చంద్రబాబు అరెస్టుపై నిరసన  తెలపాలని వారు పిలుపునిచ్చారు. దీంతో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని ముందస్తు అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గండి  బాబ్జిని వారి వారి ఇళ్లలోనే నిర్బంధించారు. అయినా.. సింహాచలం వెళ్లేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని ఎక్కడికక్కడ అదుపులోకి  తీసుకుంటున్నారు పోలీసులు. చంద్రబాబు విడుదల కాంక్షిస్తూ సింహాచల అప్పన్నను మొక్కుకునేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు  ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవదర్శనానికి వెళ్లనీయకుండా అడ్డుకోవడంపై మండిపడుతున్నారు. సింహాచలం కొండ కింద టీడీపీ నేత గిడ్డి ఈశ్వరిని పోలీసులు అడ్డుకున్నారు. సింహాచల గుడి దగ్గర టీడీపీ నేతల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. సింహాచలం అప్పన్న స్వామి దర్శనం చేసుకోవడం కూడా ఈ ప్రభుత్వంలో తప్పేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. గుడి వెళ్తామంటే... ఎందుకీ ఉలికిపాటు అని నిలదీశారు.
 
విజయవాడలోనూ టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.  చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ దుర్గగుడికి కాలినడకన వెళ్లాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. అలర్ట్‌ అయిన పోలీసులు... దుర్గగుడికి వెళ్తున్న టీడీపీ నేతలు వైవీబీ రాజేంద్రప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్‌ను అరెస్ట్‌ చేశారు. వారిద్దరినీ గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దుర్గగుడిలో అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టేందుకు వెళ్తున్న బుద్ధా వెంకన్నను కూడా పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. ఆయన్ను విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 


గుంటూరులోనూ మహాధర్నాకు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ. దీంతో అప్రమత్తమైన పోలీసులు... మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రత్తిపాటి ఇంటి దగ్గర భారీగా మోహరించారు. తాడేపల్లిలో టీడీపీ నేత తెనాలి శ్రావణ్ కుమార్‌ను కూడా గృహనిర్బంధం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో 7వ రోజు సామూహిక రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షల్లో టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి  అనురాధ, పార్టీ నేత ధూళిపాళ్ల జ్యోతిర్మయి పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్దసంఖ్యలో హాజరయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చెన్నైలో ఐటీ ఉద్యోగులు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. 


హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లోనూ విఘ్నేశ్వర హోమం తలపెట్టారు టీడీపీ నేతలు. చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ హోమం నిర్వహిస్తున్నారు. ఈ హోమంలో  తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఈ హోమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, బక్కిన నరసింహులు,  కాట్రగడ్డ ప్రసూన పాల్గొంటున్నారు.


కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా దవ్యాంగురాలైన సుగాలి ప్రీతి తల్లిదండ్రులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం జగన్‌ను కలిసేందుకు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు జరగకుండా... సుడిగాలి ప్రీతి తల్లిదండ్రులను కూడా పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. సుడిగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకూ ఎలాంటి న్యాయం చేయలేదని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.