Gangamma Jatara In Vizag: విశాఖపట్నంలోని మత్స్యకారులు మళ్లీ తమ చేపల బోట్లను బయటకి తీస్తున్నారు. రెండు నెలలపాటు వేట నిషేధం ఉండడం తో వాళ్ళు గత 60 రోజులుగా సముద్రంలోకి వెళ్లలేదు. ఇప్పుడు ఈ నిషేధం పూర్తి కావడంతో గంగమ్మ జాతర ఘనంగా జరిపారు. విశాఖ, దాని పరిసర ప్రాంతాల్లోని జాలరి పల్లెల్లో జాతరను మత్స్యకార మహిళలు పెద్ద ఎత్తున పండుగ చేసుకున్నారు. మత్స్యకార కాలనీల్లో, జాలరి పేటల్లో, వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో భారీ ఎత్తున జానపద నృత్యాలు, మత్స్యకార సాంప్రదాయ కార్యక్రమాలు జరిగాయి. గంగమ్మ దేవత గుడి ఉండే ప్రతీ చోటా సంబరాలు జరిగాయి. వివిధ రూపాల్లో అలంకరణ వేసుకుని మత్స్యకార మహిళలు, పురుషులు చేసిన ఫోక్ డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి.


మహిళలే కీలకం 
గంగమ్మ జాతర ముఖ్యంగా మత్స్యకార మహిళలు చేసే పెద్ద పండుగ. రెండు నెలల గ్యాప్ తరువాత తమ భర్త, సోదరులు, కొడుకులు ఇలా ఇంటిలోని మగవారు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లే సందర్భంలో వారికి ఎలాంటి ఆపద రాకుండా గంగ అంటే సముద్రం చల్లగా చూడాలంటూ వారు పూజలు చేసి సముద్రంలో పసుపు కుంకుమ చల్లే ఆచారమే గంగమ్మ జాతరగా మారింది. ఒక్కసారి వేటకు వెళితే సముద్రంలో 20 రోజులవరకూ ఉండే మత్స్యకారుల అనుక్షణం ప్రమాదం అంచున ఉండాల్సి వస్తుంది. అందుకే వారి మహిళలు తమ వాళ్ల రక్షణ కోసం గంగమ్మను అంతలా పూజించేది. 


చేపల పునరుత్పత్తి కోసమే రెండు నెలల గ్యాప్ 
సముద్రంలో 10 నెలల వేట తరువాత చేపలు మళ్లీ పునరుత్పత్తి జరపడానికి వీలుగా రెండు నెలలు నిషేధం అమలులో ఉంటుంది. లేకుంటే మొత్తం చేపలే అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతీ ఏడాది ఏప్రిల్ మధ్య నుండి జూన్ మధ్య వరకూ రెండు నెలల నిషేధం ఉంటుంది. ఆ సమయంలో చేపల బోట్లన్నీ హార్బర్ లోనే ఉంటాయి. అంతకుముందు వేటాడి తెచ్చిన చేపలను కూలింగ్‌లో ఉంచో.. లేక ఎండబెట్టి డ్రై ఫిష్‌గా మార్చో వాటి అమ్మకాలపై ఆధారపడి మత్స్యకారులు జీవనం సాగిస్తారు. ఆ నిషేధ సమయం పూర్తి కావడంతో మళ్లీ వేటకు రెడీ అవుతున్నారు ఫిషర్ మెన్. ఆ సందర్బంగా ఇంటిలోని మహిళలు, ఆడపిల్లలు ఘనంగా గంగమ్మ జాతర జరుపుతున్నారు. వైజాగ్ హార్బర్‌లో మొత్తం 750 వరకూ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు ఉండగా ప్రస్తుతం 350 బోట్లను తొలి విడతగా సముద్రంలోకి తీసుకెళుతున్నారు. 


Also Read: AP Farmer Variety Idea: కోతుల నుంచి పంట కాపాడుకునేందుకు రైతు వినూత్న ఆలోచన, ఏం చేశారో చూస్తారా Watch Video


Also Read: Minister Kakani on E Crop: రైతులకు మంత్రి కాకాణి గుడ్‌న్యూస్ - ఈ క్రాప్‌ నమోదు చేసుకోండి, ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు