Chittoor Mango Farmer finds new way to save his Crop from Monkeys DNN 
తిరుపతి : అన్నదాతకు ప్రకృతే ఆధారం. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు తట్టుకుని వ్యవసాయం చేసి మనకు ఆహారాన్ని అందిస్తుంటారు. ఈ వ్యవసాయం చేసి పంట చేతికి వచ్చే లోపే ఎన్నో కష్ట నష్డాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొలం దున్ని నాటి నుండి నారు పోసే వరకూ ఎంతగానో శ్రమించే రైతు అంతకు మించి, నారు నాటి‌ నుండి కష్ట పడాల్సి ఉంటుంది. రేయింబవళ్లు కష్టపడి ఫలాలు చేతికందేలోపే ప్రకృతి ప్రకోపానికి, జంతువుల స్వైర విహారానికి పంట పొలాలు నాశనం అయ్యి రైతులు రోడ్డు పాలు అవుతున్న ఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. 


కొద్ది రోజుల్లో‌ పంట చేతికి వస్తుందనే ఆనందం కొన్ని గంటల్లో‌ ఆవిరి అవుతుంటే రైతన్న ఆవేదనకు గురై చతికల పడుతున్న పరిస్ధితులు నెలకొంటున్నాయి.. వేసవి కాలంలో అందరికి ఇష్టకరమైన, ప్రీతికరమైన పండు‌ మామిడి, ఈ పంటను‌ పండించే ఓ రైతుకు వర్షం రూపంలో కోలుకోలేని‌ నష్టం కలిగిస్తే, మిగిలిన పండ్లను కూడా వానరాలు నాశనం చేయడం చూసి తట్టుకోలేక పోయాడు. ఎలాగైనా కోతులను కట్టడి చేయాలన్న అతని ఆలోచన మంచి ఫలితాలను అందిస్తుంది. పంటను కాపాడుకునేందుకు ఆ రైతు ఏం చేశాడో తెలిస్తే అవాక్కు అవుతారు.


చిత్తూరు జిల్లాలో అధిక శాతం మంది రైతులు మామిడి‌ పంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ముఖ్యంగా పడమటి ప్రాంతం రైతులు మామిడి సాగు చేస్తూ వాటి‌ ద్వారానే ఆదాయం ఆర్జించడమే కాకుండా, సంవత్సరం పొడవునా మామిడి పంట సాగుకు అవసరం అయ్యే వాటిని సమకూర్చుకుని, మామిడి సాగులో మెలకువలతో అధిక శాతం దిగుబడి సాధించాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న మామిడి చెట్లను కోతులు ధ్వంసం చేయడమే కాకుండా, ఆ పంటను నాశనం చేస్తుంటే చూసి తట్టుకోలేని ఓ రైతులు వినూత్న ఆలోచనతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 


పలమనేరు మండలం, కేట్లఫారంకు సమీపంలోని రామాపురం గ్రామంలో సుబ్రమణ్యం నాయుడు నివాసం ఉంటున్నారు. ఇతను దాదాపుగా 20 ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. సంవత్సర కాలం పాటు మామిడి తోపుపై పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న తరుణంలో మరో రెండు వారాలు ఎదురుచూస్తే భారీగా దిగుబడి సుబ్రమణ్యం నాయుడికి రానుంది. అదే సమయంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు మామిడి సాగుకు తీవ్ర నష్ట కలిగించాయి. ఆ దెబ్బ నుండి కోలుకోక మునుపే కోతులు మామిడి తోపులో చేరి పంటను నాశనం చేస్తున్నాయి. చేతికి వస్తున్న మామిడి పళ్లను కొరికి నేలపై విసిరి కొడుతున్నాయి. 



సుబ్రమణ్యం నాయుడుకు ఏమి తోచని స్థితిలో, వానరాల నుంచి పండ్లను కాపాడుకునేందుకు కర్ణాటక రాష్ట్రంలో ఓ రైతు వినూత్న ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యాడు. పంటను ఎలా కాపాడుకోవాలనుకునే క్రమంలో కర్ణాటకలోని ముళ్ బాగుళ్ ప్రాంతంలో వానరాలు భయపడే బొమ్మలను విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు. అక్కడకు వెళ్ళి రూ.500 పెట్టి భయంకరమైన, వికృతమైన తల ఆకారాన్ని తీసుకొచ్చారు. దాన్ని రైతు తలకు బిగించుకొని మామిడి తోటలో శబ్దం చేస్తూ కోతుల వద్ద కెళితే అవి భయపడి పారిపోతున్నాయి. ఆ వికృతమైన తలవైపునకు కోతులు అసలు చూడడం లేదని రైతులు అంటున్నారు. కోతులను తరిమేస్తున్న ఈ బొమ్మను చూసేందుకు చుట్టుపక్క రైతులు కూడా ఆసక్తిగా చూపుతున్నారు.


మామిడి సాగు రైతు ఈ సందర్భంగా రైతు సుబ్రమణ్యం నాయుడు మాట్లాడుతూ.. తన 20 ఎకరాల మామిడి తోటలో అకాల వర్షాలు కారణంగా 80% పంట నష్టం కలిగిందన్నారు. మిగిలిన 20 శాతం పంటను కాపాడుకునే  ఈ ప్రయత్నం చేశానని చెప్పారు. అయితే ఇందుకోసం ఓ వ్యక్తిని కూలీకి ఒప్పుకుని అతనికి ఈ భయంకర బొమ్మను మూతికి వేసుకుని మామిడి తోపులో‌ కేకలు వేయిస్తూ తిప్పుతూ ఉన్నానని, ప్రస్తుతం మామిడి తోపులో కోతుల బెడద తగ్గిందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Weather Updates: వేగంగా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు - నేడు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు


Also Read: Minister Kakani on E Crop: రైతులకు మంత్రి కాకాణి గుడ్‌న్యూస్ - ఈ క్రాప్‌ నమోదు చేసుకోండి, ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు