Former MLA of Patapatnam is living in poverty  : 1972 లో పాతపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన చుక్క పగడాలమ్మ ప్రస్తుతం పేదరికం జీవితం గడుపుతున్నారు.  ఒక్కసారి సర్పంచ్ అయితేనే చాలు ఇక లైఫ్ లాంగ్ అవసరమైన ఆర్థిక వనరులు పోగోసు కోవడానికి డోకా లేదనుకునే రోజులివి. మరి అదే ఎమ్మెల్యే గా చేస్తే...మరి ఆలోచించక్కర్లేదు. ఎమ్మెల్యే గా అయిదేళ్లు సేవలందించిన ఆమె రేషన్ ,వైద్యసేవలందించండి  వేడుకుంటుంది..మీరు నమ్ముతారా...? మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇదో పచ్చి నిజం.. వేలమందికి ప్రజా ప్రతినిధిగా సేవలందించిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు తనకు సహాయం చెయ్యండి మహాప్రభో అంటూ వేడుకుంటోంది. ఆమె ఎక్కడనేది మీరే చూడండి.


 1972-78 మధ్య లో పాతపట్నం ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ !


పేరు సుక్కా పగడాలమ్మ. ఈమె 1972-78 మధ్య లో శ్రీకాకుళం జిల్లా లోని పాతపట్నం నియోజికవర్గానికి శాసనసభ్యురాలిగా కొనసాగింది. ఎస్సి రిజర్వుడు గా ఉన్న ఈ స్థానం అప్పట్లో విజయనగరం జిల్లా పార్వతీపురం పార్లమెంట్ పరిధిలో ఉండేది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి లుకలాపు లక్ష్మణదాసు ఆశీస్సులతో పగడాలమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అసలే మారుమూల జిల్లా.. ఆపై మహిళ ఆంధ్రా ఒడిస్స సరిహద్దు ప్రాంతం అయిన ఈ నియోజికవర్గానికి పగడాలమ్మ ఆరేళ్ళపాటు నిస్వార్థంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ప్రజలకు సేవ చేసింది. ఇవన్నీ గతం.. ప్రస్తుతం మాత్రం ఈ మాజీ శాసన సభ్యురాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోంది. 


కటిక పేదరికంలో పగడాలమ్మ 


మెతుకు కరువై.. బతుకు బరువై.. జీవనయానం అష్టకష్టాలు తో సాగిస్తోంది. అప్పట్లో ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు తన ముప్పై ఎకరాలు భూమి సైతం హారతి కర్పూరం అయింది. పగడాలమ్మ కు ముగ్గురు ఆడపిల్లలు వారి పెళ్ళిళ్ళు చేయడానికి సగం ఖర్చు అయిపోయింది. రెండేళ్ళ క్రితం అనారోగ్యం తో భర్త మృతి చెందడంతో ఈమె జీవనం మరింత కష్టతరమైంది. ఆసుపత్రులలో వైద్యానికి ఉన్నదంతా ఖర్చుపెట్టడంతో ఇక ఈమెకు మిగిలింది అప్పులే.. తన ఎమ్మెల్యే పదవి సొంతంగా  ఎలాంటి తోడ్పాటు అందించలేకపోయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే కి ఇచ్చే ముప్పై వేల రూపాయల ఫించను మాత్రం అప్పుల వడ్డీలకు సరిపోతోంది. ఇలాంటి ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న పగడాలమ్మ.. పదవున్నప్పుడు గౌరవించిన వారే ఇప్పుడు మొఖం చాటేస్తున్నారు. 


నిజాయితీగా ఉంటే ఇలాంటి కష్టాలేనా ? 


పివి. నరసింహరావు, జలగం వెంగళరావు ముఖ్యమంత్రులుగా పనిచేసిన హయాం లో పగడాలమ్మ ఎమ్మెల్యేగా సేవలందించింది. తన పేదరికాన్ని గుర్తించి మాజీ ఎమ్మెల్యేగా తనను ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని వినయంగా కోరుతోంది ఈ పగడాలమ్మ.  శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామం లో కడు దయనీయంగా ఉంటున్న ఈ మాజీ ఎమ్మెల్యే కు నేటి ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవడం తో పాటు, ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు స్థానికులు.ఇందిరాగాంధీ లాంటి నేతలతో కలసి పనిచేసిన ఈ మాజీ ఎమ్మెల్యే వేలాది మందికి సహకారం అందించింది. అలాంటి నేత ఇప్పుడు తనకు గూడు, ఆర్ధిక సాయం చెయ్యాలంటూ కనిపించిన వారందరిని వేడుకుటోంది. 


రాజకీయ నేతలు ఆదుకోవాలని విజ్ఞప్తులు


 ఇలాంటి మాజీ ఎమ్మెల్యే లు ఎక్కడైన ఉంటారంటే ఎవరినోట వినలేదు..మరి పగడాలమ్మ కు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతోంది.  దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డికి తన పరిస్థితి తెలియచేసిన తర్వాత ..  తనను రావాలని కబురు వచ్చిందీ. అయితే  ప్రమాదం చోటుచేసుకోవడం ఆయన కానరాని లోకానికి వెళ్లిపోవడంతో తర్వాత పగడాలమ్మను పట్టించుకునేవారే లేకపోయారు.