Chandrababu on Fisherman Subsidy: రాష్ట్రంలోని మత్స్యకారులకు మొక్కుబడిగా డబ్బులు ఇస్తూ వైసీపీ సర్కారు మోసం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఏపీలో 20 లక్షల మందికి పైగా మత్స్యకారులు ఉంటే కేవలం లక్షల మందికి మాత్రమే డబ్బులు ఇచ్చి జగన్ మోహన్ రెడ్డి సర్కారు గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. వెనకబడిన వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని బాబు గుర్తు చేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. ఇవాళ వేపగుంటలోని మీనాక్షి కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు.
Also Read: Chandrababu: నాది అద్దె ఇల్లు, నీకు ఊరూరా ప్యాలెస్‌లు: సీఎం జగన్ కు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్
మత్స్యకారుల కోసం తెలుగు దేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని బాబు గుర్తు చేశారు. తొలిసారి మత్స్యకారుల బోట్లకు కమ్యూనికేషన్ కిట్లు-వీహెచ్ఎఫ్ లు పెట్టి ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా మత్స్యకారుల ప్రాణాలు కాపాడటానికి లేటెస్ట్ టెక్నాలజీ వాడిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసినట్లు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల కోసం రూ. 788 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు మత్స్యకారులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు వైసీపీ ప్రభుత్వం పరిహారం అందించడలం లేదని, అది చాలా దుర్మార్గమని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రాగానే తప్పకుండా మత్స్యకారుల కుటుంబాలకు వెంటనే ఆర్థిక పరమైన వెసులు బాటు కల్పిస్తామని మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
Also Read: Chandrababu Visakha Tour: బుధవారం నుంచి 3 రోజులు ఉత్తరాంధ్ర పర్యటనకు చంద్రబాబు - పూర్తి షెడ్యూల్ ఇలా
'వెనకబడిన వర్గాలను గుర్తించిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏకైక నాయకుడు నందమూరి తారకరామారావు. రాజకీయంగా బీసీలను పైకి తేవాలని, నాయకులను తీర్చిదిద్దాలని, స్థానిక సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్లు పెట్టారు. వెనకబడిన వర్గాలకు ఆ రోజు గుర్తింపు ఇవ్వడం ద్వారా సమర్థవంతమైన నాయకులు వచ్చారు. ఇప్పుడు ఈ వేదికపై వెనకబడిన వర్గాల నాయకులు కూర్చున్నారంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు చూపిన చొరవ, తీసుకున్న నిర్ణయాల ఫలితం. ఆ తర్వాత రిజర్వేషన్లను 33 శాతానికి పెంచారు. వెనకబడిన వర్గాలను పెంచాలని టీడీపీ సర్కారు రిజర్వేషన్లు పెంచితే.. వైసీపీ సర్కారు మాత్రం ఆ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించింది. మత్స్యకారుల బోట్లకు మొట్టమొదటిసారి వీహెచ్ఎఫ్ టెక్నాలజీలు పెట్టి ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేసేలే చూసి లేటెస్ట్ టెక్నాలజీతో ప్రజలను కాపాడిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది.
అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. సంవత్సరానికి కేవలం మత్స్యకారుల కోసమే రూ. 788 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పుడు మాత్రం ప్రమాదవశాత్తు మత్స్యకారులు ఎవరైనా చనిపోతే బెనిఫిట్స్ సమయానికి అందట్లేదు. తప్పకుండా ఇది సవరించాలి. టీడీపీ అధికారంలోకి రాగానే మత్స్యకారులు ఎవరైనా చనిపోయిన వెంటనే ఆర్థికపరమైన వెసులుబాటు ఇవ్వడమే కాకుండా వితంతు పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. 20 లక్షల మత్స్యకారులు ఉంటే కేవలం లక్ష మందికి మాత్రమే బెనిఫిట్స్ ఇస్తోంది వైసీపీ ప్రభుత్వం. అది కూడా అనేక ఆంక్షలు పెడుతోంది. ఇది చాలా దుర్మార్గం. తెలుగుదేశం పార్టీ హయాంలో కేవలం మత్స్యకారుల కోసం 9 రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పాం. టీడీపీ ప్రభుత్వానికి మత్స్యకారులపై ఉన్న ప్రేమకు అది నిదర్శనం' అని చంద్రబాబు పేర్కొన్నారు.