అంతర్జాతీయ స్థాయిలో భారీ హంగులతో నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టు ఆలోచన ఏడేళ్ల క్రితం ప్రభుత్వానికి వచ్చింది. దానికి సంబంధించి మూడేళ్ల క్రితం వేసిన శంఖుస్థాపన రాయి ఇది. మొదట్లో 15వేల ఎకరాలతో ప్రారంభమైన ఇక్కడి భూ సేకరణ చివరకు 2700 ఎకరాలకు కుదించుకుపోయింది. ఈ 2700 ఎకరాల్లో ఏం జరుగుతోంది..? ఈ భూమిని ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి..
అలా మొదలైంది..
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో మరడపాలెం, ముడసర్లపేట, బొల్లింకలపాలెం, రిల్లిపేట ఈ నాలుగు గ్రామాలు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణంతో పూర్తిగా కనుమరుగు కానున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీ అమలు చేయకుండా తమను గ్రామాలు వదిలి వెళ్లాలని బెదిరిస్తున్నారంటూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గ్రామస్థులు, అధికారుల మధ్య నిత్యం వాగ్వాదాలు సాధారమైపోయింది.
15వేల ఎకరాల ప్రతిపాదన తగ్గుతూ తగ్గుతూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. అధునాతనంగా, భారీ ఎత్తున తలపెట్టిన ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి తొలుత 15 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదలనలు సిద్ధం చేశారు. అయితే దీనిపై స్థానికుల అందోళనలతో అది సుమారు ఐదున్నర వేల ఎకరాలకు, ఆ తర్వాత అది 2 వేల 7 వందల ఎకరాలకు కుదించారు.
2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన
2019 ఫిబ్రవరిలో అప్పటీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన కూడా చేశారు. అప్పటీ నుంచి ఇప్పటీ వరకు ఈ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఆ శిలాఫలకం తప్ప మరొక ఇటుక కూడా పడలేదు. ఈ పరిస్థితుల్లో విమానాశ్రయ నిర్మాణ పనులన్నీ ప్రారంభించాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా నిర్వాసితులను గ్రామాల నుంచి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పరిహారం చెల్లింపులు, పునరావాస కాలనీలు నిర్మాణం పూర్తవ్వకుండా వెళ్లిపోమ్మంటే ఎక్కడికి వెళ్తామని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.
ఎలా బతకాలి?
మా పరిస్థితి ఏటి, మాకో పరిష్కరం చెప్పి ఇల్లు ఖాళీ చేయమంటే ఆనందంగా ఉంటుంది. ఊర్ని ఇంత అల్లకల్లోలం చేసి ఎళ్లిపోమ్మంటే మేం ఎలా ఎళ్లి బతికాలి. ఇప్పుడే ఇలా బెదిరిస్తున్నారంటే మేం అక్కడికి ఎళ్లిన తర్వాత మా పరిస్థితి ఏటి. మాకు న్యాయం చేస్తే మేం యళ్తామంటున్నారు భోగాపురం విమానాశ్రయ నిర్వాసితులు.
గ్రామాల‌్లోని నిర్వాసితులకు పునరావాస కాలనీల నిర్మాణం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల చెల్లింపులు, నిర్వాసితుల కుటుంబాల్లోని వారికి భూమి, ఉద్యోగం ఇవ్వడం వంటి అనేక హామీలు ఇచ్చారని ఇవేవి పూర్తి చేయకుండానే గ్రామాలను ఖాళీ చేయించాలని అధికారులు ప్రయత్నించడం ఎంత వరకు న్యాయమని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.
భయపెడుతున్నారని ఆరోపణలు
మరడపాలెం, ముడసర్లపేట, రెల్లిపేట, బొల్లింకలపాలెం నిర్వాసిత గ్రామాల్లో అధికారులు రోజూ పర్యటించడం, గ్రామాల్లోని చెట్లను కొట్టేయడం, ఇళ్లను పడగొట్టడం వంటి పనులు చేస్తున్నారని తమని భయపెట్టి ఖాళీ చేయించాలని చూస్తున్నారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. భూములు కోల్పోవడం, పరిహారం అందకపోవడంతో తమ కుటుంబాల్లోని పిల్లలకు సంబంధాలు కూడా రావట్లేదని వాపోతున్నారు.
ఊరి పేరు చెబితేనే పెళ్లి కానేదు
పెళ్లీడుకొచ్చిన యువకులకు సంబంధాల కోసం వెళ్తే భూములు లేవు, ఇల్లులు లేవు, మీకు మా పిల్లలను ఎలా ఇవ్వాలి, మేమైతే ఇవ్వమంటూ మొహమ్మీదే చెప్పేస్తున్నారన్నారు. ఏ ఊరు వెళ్లినా సరే సంబంధాలు ఇవ్వడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. ఉన్నట్టుండి వెళ్లిపోవాలంటే ఎక్కడికి వెళ్లిపోవాలో చెప్పాలంటు ప్రశ్నిస్తున్నారు. ఎందులో పడగలం సముద్రంలో పడగలమా... నూతిలో పడగలమా... గెడ్డలో గెంతగలమా.. ఎక్కడికి వెళ్లినా ఏ ఆధారం లేదంటున్నారు.
ఉరకేసుకొని సచ్చిపోవాలా?
ఇప్పుడు ఈ ప్రభుత్వం పేరు చెప్పి మేం ఎక్కడైనా ఉరేసుకుని సచ్చిపోవాలా...ఏదైనా మింగేసి సచ్చిపోవాల ఏం చేయాలో మాకే అర్థం కాలేదిప్పుడు అంటున్నారు నిర్వాసితులు. చాలా ఆందోళనగా ఉందని రాత్రిళ్లు నిద్రపట్టడం లేదంటున్నారు. ఈ పిల్లలు ఏటైపోతారు. ఈ పిల్లల భవిష్యత్తు ఏటి అని... ఇప్పుడు మా జీవితం సగం అయిపోయంది. మేం సచ్చిపోమన్నా సచ్చిపోతాం. పిల్లలకి భవిష్యత్తు ఉండాలి కదా. ఆ పిల్లలకు తోవ చూపిస్తే మేం ఆనందంగా వెళ్లిపోతామంటున్నారు.
భయపెట్టడం లేదంటున్న అధికారులు
నిర్వాసితులను భయభ్రంతులకు గురి చేస్తున్నామని అనడం వాస్తవం కాదని ఎవరైతే ప్యాకేజీ సొమ్ము అందుకుని స్వచ్చంధంగా తమ స్థలాలను అప్పగించారో వాటిలో నిర్మాణాలు, మొక్కలు ఉంటే తొలగిస్తున్నామంటున్నారు అధికారులు. స్వచ్ఛంధంగా భూములు ఇచ్చిన కేసులు కూడా చాలా తక్కువ ఉన్నాయని భోగాపురం తహశీల్దార్ రమణమ్మ చెప్పారు.
భూములు తీసుకోక తప్పదు: అధికారులు
ఎయిర్ పోర్టు కోసం సేకరించిన భూములపై అధికారుల పర్యవేక్షణ ఉంటుందని అంతేకానీ భయపెట్టడం అనే మాటల్లో నిజం లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలను అందాకే వారు అక్కడ నుంచి వెళ్లొచ్చని చెప్పారామె. ప్రస్తుతానికి ఎటువంటి డెడ్ లైన్ లేదన్నారు. పునరావాసం కల్పిస్తున్నామని... దానికి కొంత టైమ్ ఇస్తున్నామన్నారు. భూములైతే తీసుకోక తప్పదంటున్నారు తాహశీల్దార్. వాళ్లే స్వచ్ఛందంగా ఇచ్చారని... ఇప్పుడు ఈ భూములన్నీ ఎయిర్ పోర్టు ఎలైన్ మెంట్‌లో ఉన్నాయని ఎప్పటీకైనా ఖాళీ చేయాల్సి ఉంటుందంటున్నారు రమణమ్మ.
నిర్వాసితులు ఏదైతే ఇల్లు విడిచిపెడుతున్నారో దానికి అధికారులు విలువ కడతారు. ఆ ఇల్లు వాళ్లు విడిచిపెట్టి అధికారులకు అప్పగిస్తే ఆ ఇంటికి డిసైడ్ చేసిన రేట్ ప్రకారం ఆ అమౌంట్ వెంటనే అకౌంట్‌లో వేస్తారు. ఈ ప్రాసెస్‌లో ఇళ్లు అప్పగించిన వాళ్లు ఐదారుగురే ఉన్నారు. డబ్బులు కూడా వారి అకౌంట్స్‌లో వేసేశారు.
ఒత్తిడి లేదు... నోటీసులు లేవు
మిగిలిన వారిపై ఎలాంటి ఒత్తిడి లేదంటున్నారు అధికారులు. నోటీసులు ఇవ్వడం కానీ, బెదిరింపులకు దిగడం గానీ లేదంని వివరణ ఇచ్చారు. మరడపాలెంలో 223, ముడసర్లపేటలో 39, బొల్లింకలపాలెంలో 55, రిల్లిపేటలో 65 కుటుంబాలను పునరావాసం కోసం రెండు కాలనీలను నిర్మిస్తున్నారు. గూడెపువలసలో 17 ఎకరాలు, లింగాలవలసలో 25 ఎకరాల్లో ఈ కాలనీల నిర్మాణం జరుగుతోంది. వీటి పనులు గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమయ్యాయి. ఒక్కొక్కరికి ఐదు సెంట్ల భూమి కేటాయించారు. కొండపై ఈ కాలనీలకు స్థలం ఇవ్వడంతో స్థలం చదును, పునాదులకే ఖర్చు ఎక్కువైపోతుందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. బాంబులు పెట్టి ఈ కొండలను పేల్చుతున్నామని...వాటికి లక్షల్లో ఖర్చవుతుందని చెప్తున్నారు.
పరిహారం డబ్బులన్నీ చదును చేయడానికే..
ఇప్పుడు రాళ్లుకే లక్షయాభై వేలు, రెండేసి లక్షలు అయిపోతుందని... ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇస్తున్న రూ. 9.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందంటున్నారు. ఈ అదనపు ఖర్చుతోపాటు బాధిత యువతకు ఉద్యోగాలు, వలస వెళ్లిన వారికి ఇస్తామన్న ఆర్ఆర్ ప్యాకేజీ హామీని నెరవేర్చాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు తమకు ఎలాంటి సాయం అందలేదని ప్రభుత్వం నుంచి ప్యాకేజీ వస్తే గ్రామం నుంచి వెళ్లిపోతామని అంటున్నారు.
జోరుగా రియల్ ఎస్టేట్
విమానాశ్రయం నిర్మాణాన్ని పీపీపీ పద్ధతిలో జీఎంఆర్ సంస్థ నిర్మించనుంది. శంకు స్థాపన జరిగి మూడేళ్లైనా కూడా ఇప్పటీ వరకు ఎయిర్ పోర్టుకు సంబంధిచిన పని ప్రారంభం కాలేదు. కానీ భోగాపురం ఎయిర్ పోర్టు ప్రకటన వచ్చినప్పటీ నుంచి భోగాపురం చుట్టూ పక్కల 10 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం జోరందుకుంది. ఎయిర్ పోర్టు వస్తుందనే వార్తలతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మధ్యలో ఉండే భోగాపురం, దాని సమీప ప్రాంతాల్లో భూముల ధరలు ఊహకందని విధంగా పెరిగాయి.
ఎయిర్ పోర్ట్ రాక ముందు ఎకరా 20 లక్షలు, 30 లక్షలు ఉండేది. ఇప్పుడది కోటి, రెండు కోట్లు అయిపోయింది. హైవే దగ్గరైతే 10 కోట్లు కూడా ఉంది. లోపుకెళ్తే రెండు కోట్లు, మూడు కోట్లు పలుకుతుంది. ఎయిర్ పోర్టుకు భూములిచ్చిన నిర్వాసితులైతే ఇంకా మాకు న్యాయం జరగలేదంటూంటే...అర్హులైన ప్రతిఒక్కరికి న్యాయం చేస్తూనే ఉన్నామని అంటున్నారు అధికారులు. భోగాపురం ఎయిర్ పోర్టు కోసం వేసిన శంకుస్థాపన రాయి తప్ప మరేపని జరగకపోగా...భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతోనే ఇక్కడ వందల రిసార్టులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి.