కొన్ని నెలల క్రితం ఎన్‌ఐఏ సోదాలతో మారుమోగిన పేరు రాధిక. విశాఖకు చెందిన ఈమె ఇన్నేళ్లకు ఓ లెటర్ విడుదల చేశారు. తాను మావోయిస్టుల్లో చేరినట్టు లేఖలో పేర్కొంది. విశాఖకు చెందిన రాధిక 2017లో అదృశ్యమయ్యారు. గతంలో ఆమె చైతన్య మహిళా సంఘం సభ్యురాలు. అయితే రాధిక మావోయిస్టుల్లో చేరినట్టు సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ హైదరాబాద్‌లోని చైతన్య మహిళా సంఘం సభ్యుల ఇళ్లపై సోదాలు చేశారు. స్వప్న, దేవేంద్ర, చుక్కా శిల్ప అనే వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు.
2022 జూన్ నెలలో జరిగిన ఈ ముగ్గురి అరెస్ట్ తీవ్ర సంచలనం సృష్టించడంతోపాటుగా 2017లో అదృశ్యమైన రాధిక అంశాన్ని వెలుగులోకి తెచ్చాయి. విశాఖలోని పెదబయలు పోలీస్ స్టేషన్లో రాధిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ సోదాలు జరిపినట్టు పోలీసులు, ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. ఇన్నాళ్లకు పల్లెపాటి రాధిక పేరుతో ఒక లేఖను రిలీజ్ చేసింది సీపీఐ మావోయిస్టు పార్టీ.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అరెస్టులు, సోదాలు అక్రమంగా జరిగినవేననీ..దర్యాప్తు బృందాలు చెబుతున్నట్టు తాను వైద్య విద్యార్థినినే కాదనీ చెప్పారు రాధిక. తాను డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విద్యార్థిని అని లేఖలో వివరించారు రాధిక. ఇష్టంతోనే మావోయిస్టుల్లో చేరినట్టు తెలిపారు. అప్పటికి తన వయస్సు 20 ఏళ్ళనీ.. ఏది తన కిష్టమో నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఉందని లేఖలో పేర్కొన్నారు.
చైతన్య మహిళా సంఘానికి తానెప్పుడూ రాజీనామా చేశానని దానికీ తనకూ ఎలాంటి సంబంధం లేదని రాధిక స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న దోపిడీ ఆగాలంటే సమాజంలో సమూల మార్పు రావాలని..దానికి మావోయిస్టు పార్టీ నాయకత్వంలో కొనసాగుతున్న పోరాటంలో భాగం కావడం ముఖ్యమని భావించి వారితో కలిసినట్టు తెలిపారు. పెదబయలు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు కూడా పోలీసులు తన పేరెంట్స్‌ను బ్లాక్ మైయిల్ చేసి ఒత్తిడితో చేయించిన కంప్లైంట్‌గా వివరించారు రాధిక.