CPI Narayana: రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే అధికార పార్టీ వైసీపీ పని అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అలాగే సీఎం జగన్ నాడు అమరావతి రాజధాని అని చెప్పి నేడు మూడు రాజధానులు అని మాట మార్చడం సరికాదన్నారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజధానులపై నిర్ణయాలు మార్చడం చాలా తప్పని.. సీఎం జగన్ దిగజారుడుతనానికి ఇది నిదర్శనం అన్నారు. అలాగే విశాఖకు వచ్చిన ప్రధాని 11 వేల కోట్ల రూపాయల హామీకే మురిసిపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మరో వైపు విశాఖ ఉక్కు ప్రైవేటుకు అప్పగిస్తుంటే నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని నారాయణ విమర్శలు గుప్పించారు.
వారి బంధం ఫెవికాల్ లాంటిది !
పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ఉమ్మడి ఆస్తుల పంపిణీపై ముఖ్యమంత్రి జగన్ ప్రధాన మంత్రి మోదీని ప్రశ్నించలేక పోయారని ఎద్దేవా చేశారు. వైసీపీ విజయానికి సహకరించేలా మోదీ వ్యవహరించారని విమర్శలు చేశారు. వైసీపీ, బీజేపీ బంధం ఫెవికాల్ అంత దృఢమైనది అని నారాయణ తనదైన శైలిలో విరుచుకు పడ్డారు.
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని, ఆ సంస్థకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకంటోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణలు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు చెందిన అనేక శాఖల్లో ఏపీ అధికారులు తనిఖీలు చేసినా కూడా చిన్న పొరపాటు కూడా గుర్తించలేకపోయారని విమర్శలు చేశారు. రాజకీయాల కోసం ఇలాంటి దాడులు చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి తీవ్రంగా తప్పుపట్టారు.
ఒక్క హామీ అయినా నెరవేర్చారా?
విశాఖను రాజధాని చేసి మరింత అభివృద్ధి చేస్తామని, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వైసీపీ నాయకులు, ఆ పార్టీ ప్రభుత్వం చెబుతోందని, కానీ అదే విశాఖలోని స్టీల్ పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ సర్కారు ఏమీ చేయలేకపోతోందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. విశాఖలోని రుషికొండను మొత్తానికి మొత్తం తవ్వేస్తున్నారని, ఇంకెక్కడి అభివృద్ధి అంటూ నారాయణ ప్రశ్నలు గుప్పించారు. 3 లక్షల కోట్ల రూపాయల విలువైన స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే దానిపై ప్రశ్నించే సాహసం వైసీపీ సర్కారు చేయడం లేదని అన్నారు. విభజన చట్టంలో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా హామీ కేంద్ర సర్కారు నెరవేర్చడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాయలసీమలోని వెనకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ అన్యాయం జరిగిందని అన్నారు.
అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడుస్తున్నా ఒక్క హామీని నెరవేర్చలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడాలంటే రాష్ట్రంలో టీడీపీ అనేది ఉండకూడదని బీజేపీ భావిస్తోందని నారాయణ ఆరోపించారు. టీడీపీ బలపడకుండా ఉండేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. అందుకే విశాఖపట్నానికి వచ్చిన ప్రధాని మోదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పక్క చూపులు చూడవద్దని తమ వైపే చూడమని చెప్పినట్లు ఉందని నారాయణ ఆరోపించారు.