AP Politics: ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ముందే ప్రకటించాలని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. సరిగ్గా పని చేయని వారికి టికెట్ ఇవ్వబోమని చంద్రబాబు నిర్మొహమాటంగా ప్రకటించేయాలని అభిప్రయాపడ్డారు. ఒకవేళ తాను గెలవలేను అనే అభిప్రాయం ఉన్నాసరే టికెట్ ఇవ్వొద్దని చెప్పారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. శ్రీరాముడు తనొక్కడే వెళ్లి రావణుడిని చంపలేడా? అయినా.. హనుమంతుడు, విభీషణుడు, ఉడతా ఇలా అందరినీ సాయం తీసుకున్నది లోక కల్యాణం కోసమే. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్యాణం కోసం చంద్రబాబు నాయుడు అలాంటి ఆలోచనే చేయాలని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
'ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి?' అని మార్చాలి
"9 ఎన్నికల్లో పోటీ చేశా.. 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలుపొందా.. రెండు సార్లు ఓడిపోయా.. నాకు ప్రజల నాడి తెలుసు. ఇప్పటికే ప్రజల్లో ట్రెండ్ మారిపోయింది. ఈ దుర్మార్గ పాలన వద్దు అని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు నాయుడిని గెలిపిస్తామని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం. అందుకే అభ్యర్థులను ముందే నిర్ణయించాలి. సరిగ్గా పని చేయని వారికి టికెట్ ఇవ్వబోమని చంద్రబాబు మొహమాటం లేకుండా చెప్పాలి" అని అయ్యన్నపాత్రుడు అన్నారు. "తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని టీడీపీ నాయకులు అంతా 175 నియోజకవర్గాల్లో గట్టిగా నిలదీసి నిలబడాలి. కింది స్థాయికి వెళ్లే వరకు మాట్లాడుతూనే ఉండాలి. అలాగే 'ఇదేం ఖర్మ' పేరులోనూ కొన్ని మార్పులు చేయాలి. దానిని 'ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి?' అని మారిస్తే బాగుంటుంది" అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే
మూడున్నర సంవత్సరాల రావణాసుర పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వ నాశనం అయిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పని అయిపోయినట్లే అని శ్రీకాకుళంతో మొదలు అయిన ప్రభుత్వంపై వ్యతిరేకత మహానాడుతో ఉద్ధృతం అయిందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర ప్రజల బాధల నుండి విముక్తి కలిపిస్తాయని అచ్చెన్నాయుడు అన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ విశేష ప్రజల ఆదరణ లభిస్తోందని ఎంపీ కె. రామ్మోహన్ నాయడు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. వైసీపీ సర్కారుపై, పాలన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసించడం లేదని పేర్కొన్నారు. జగన్ బ్రిటిష్ వారికి వారసుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు రాజధాని అని చెబుతూ విశాఖలో భూముల్ని ఇష్టానుసారంగా కొట్టేస్తున్నారని ఆరోపించారు. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా రాజధాని తరలిస్తామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీదే గెలుపు అని, జెండా ఎగురవేసేది తామేనని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి రాక్షస పాలనపై వారే తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు. కౌరవ సభను గౌరవ సభగా చేస్తామని చెప్పారు. ప్రజలకు 2024లో మరింత సంక్షేమాన్ని అందిస్తామని ధీమాగా తెలిపారు.