Vizag Lands Issue :  విశాఖ పట్నంలో భూముల వివాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఓ వైపు దసపల్లా, రేడియంట్, విజయసాయిరెడ్డి కుమార్తెకు చెందిన కంపెనీ భూములు అంటూ అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు పేదలు దశాబ్దాలుగా ఉంటున్న కొన్ని స్థలాలను ప్రభుత్వానివిగా గుర్తించి రాత్రికి రాత్రి అందులో ఉన్న ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. ఆ ఇళ్లలోని వారికి నోటీసులు ఇవ్వడం కాదు కదా.. కనీసం సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. దీంతో  విశాఖ వాసులు ఎప్పుడు తమ ఇంటిపైకి జేసీబీ వస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. 


ఆ స్థలం తమదని సుప్రీంకోర్టు డిక్రీ ఇచ్చిందన్న  ప్రైవేటు వ్యక్తులు


విశాఖలోని బాపన అప్పారావు దిబ్బ గురించి అందరికీ తెలుసు. అందులో దుకాణాలు ఉంటాయి. దాదాపుగా యాభై ఏళ్లుగా అక్కడ దుకాణాలు ఉంటాయి. అయిదే ఆ బాపన అప్పారావు దిబ్బలో ఉన్న దుకాణాలను రాత్రికి రాత్రే అధికారులు కూల్చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనకు వస్తున్నారని.. వాహనాల పార్కింగ్‌కు ప్రదేశం అవసరం అయిన కారణంగా ఆ దిబ్బను ఖాళీ చేయిస్తున్నామని అధికారులు చేప్పి మొత్తం కూలగొట్టేశారు. ప్రధానమంత్రి నగరానికి వస్తే  పార్కింగ్ బాపన అప్పారావు దిబ్బ మీదే చేయాలని ఎందుకు అనుకున్నారో కానీ.. పేదల నివాసాలు.. దుకాణాలు మాత్రం ఖాళీ అయిపోయాయి. దీంతో పలువురు రోడ్డున పడ్డారు. 


ఆ స్థలం తమదేనని ఏయూ వీసీ ప్రసాదరెడ్డి వాదన


బాపన అప్పారావు దిబ్బ స్థలంపై కొన్నాళ్ల కిందటి వరకూ వివాదం ఉంది. అది ఆంధ్రా యూనివర్శిటీ స్థలం అని ఏయూ వర్గాలు చెబుతూ ఉంటాయి. అయితే దీనిపై సుదీర్గమైన న్యాయపోరాటం జరిగింది. 1954 నుంచి రెండు వర్గాల మధ్య న్యాయపోరాటం జరగింది. చివరికి సుప్రీంకోర్టు 2011 లోనే తమకు డిక్రీ ఇచ్చిందని  బాపన అప్పారావు చెబుతున్నారు.  ఎకరం పైన గల తమ స్థలంలో ఇక్కడి షాపులను అద్దెకు ఇచ్చి బతుకుతున్నామని.. ప్రధాని పర్యటన లో కార్ పార్కింగ్ అంటూ దుకాణాలు తొలగించారని.. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని వారు వాపోతున్నారు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఈ స్థలాన్ని యూనివర్సిటీ స్థలం అంటున్నారని కానీ అది అవాస్తవం అని చెబుతున్నారు రాత్రికి రాత్రి దుకాణాలు తొలగించడం తో తాము అన్యాయం అయిపోయామని అంటున్నారు.


ప్రభుత్వం పేదల ఇళ్లను కూలగొడుతోందని విపక్షాల విమర్శలు


దసపల్లా భూములను సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందునే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇవ్వకపోతే సుప్రీంకోర్టు ధిక్కరణ అవుతుందన్నారు. కానీ బాపన అప్పారావు దిబ్బ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు డిక్రీ ఇచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయినా కూలగొట్టారని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో పేదల ఇళ్లపై విరుచుకుపడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  దుకాణాలు తొలగించిన ప్రాంతాన్ని   టీడీపీ నేతలు సందర్శించి బాధితులు పక్షాన న్యాయ పోరాటం చేస్తామని  హామీ ఇచ్చారు. ఈ వివాదం రాజకీయ దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.