ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో పూర్తికావడం లేదు. వైఎస్ఆర్ జగనన్న కాలనీ పేరిట పూర్తి చేయాలనుకున్నప్పటికి సీఎం ఆశయాలకు తగ్గట్టు పనులు ముందుకుసాగడం లేదు. జిల్లాలో లేఅవుట్లకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినా ఫలితం లేకపోయింది. స్థలం కొనుగోలులో నిధులు చేతులు మారాయి తప్ప కొన్ని చోట్ల లబ్ధిదారులకు ఆశించిన స్థాయిలో స్థల సేకరణ చేపట్టకపోవడం నేలవిడిచి సాము చేసేలా ఇళ్ల నిర్మాణం మారింది.
సమస్యల సుడిగుండంలో ఇళ్లు
భారీ లేఅవుట్లు ఏర్పాటు చేసిన నీరు లేకపోవడం, రోడ్లు పూర్తి చేయకపోవడం, విద్యుత్ సరఫరా ఇవ్వక పోవడంతో ఒకడుగు ముందుకు రెండు అడుగుల వెనక్కి అన్నట్టు ఉన్నాయి నిర్మాణాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినానికి భారీగా గృహ ప్రవేశాలు చేయాలనుకున్న ఆశయం అయ్యేలా కనిపించడం లేదు. భారీ మొత్తంలో ప్రభుత్వం నిధులు వెచ్చించడంతో స్థల సేకరణలో సక్సెస్ అయినా ఇళ్ల నిర్మాణాల్లో మాత్రం అధికారులు వైఫల్యం చెందారనే విమర్శలు వస్తున్నాయి.
అందని ఇసుక
ప్రభుత్వం సకాలంలో సిమెంటు, ఐరన్ అందజేయలేకపోతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు జిల్లా ఇసుకకు గని అయిన ఇళ్ల నిర్మాణాలకు అందడం లేదు. చెరకు బండిపై కూర్చొని మూలకర్ర నమిలినట్టుగా ఉందని అధికార పార్టీ నేతలే ఇసుక విషయంలో తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. కొన్ని లేఅవుట్లతోపాటు సొంతంగా ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అందక పనులు జాప్యం అవుతున్నాయని జడ్పీ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ లాంటి వారే ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి.
రాజధాని కారణంగా రాని ఇళ్ల ప్రస్తావన
గత నెల 28న నిర్వహించిన జడ్పీ సమావేశంలో గృహనిర్మాణ శాఖపైనే పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉంది కానీ రాజధానిని అధికార పార్టీ ప్రాధాన్యత అంశంగా తీసుకోవడంతో ఆ శాఖాధికారులు సేఫ్ అయ్యారని ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే జగనన్న కాలనీల్లో పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన 77 వేల గృహాలను నిర్మించాలని భావించారు. కానీ పనులు జాప్యంతో నిర్మాణాలు ఆలస్యమైంది. ఇంతలో కేంద్ర ప్రభుత్వం ఇళ్ల పథకానికి తమ పేరు పెట్టాలని లేకుంటే రూ.1.80లక్షలు ఇచ్చేది లేదంటు హెచ్చరించింది. దీంతో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (పీఎంఏవై) పేరు కూడా జోడించాల్సిన వచ్చింది.
77,550 ఇళ్ల నిర్మాణానికి యత్నం
ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో ఇళ్ల నిర్మాణాలలు పురోగతి సాధిస్తుందనుకుంటున్నా కొన్నిచోట్ల అసలు ముందుకు సాగడం లేదు. జిల్లాలో 77,550 గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి జిల్లా అధికారులు సమాయత్తమయ్యారు. దాదాపుగా ప్రాజెక్టు విలువ 139.90 కోట్ల రూపాయలుగా గుర్తించారు. 672 లేఅవుట్లలో 38695 కాలనీ ఇళ్లు నిర్మించేందుకు, సొంత స్థలంలో చేపడుతున్నవి 38,855 ఇళ్లు పూర్తి చేసేందుకు రెడీ అయ్యారు. గ్రామీణ ప్రాంతంలో 28 లేఅవుట్లు ఉండగా 19829 ఇళ్లు, పట్టణ ప్రాంతంలో 644 ఉండగా ఇందులో 57721 ఇళ్లు నిర్మించేందుకు నిర్ణయించారు.
పట్టణం, వుడా ప్రాంతంలో భారీ ఎత్తుగా ఇళ్లు నిర్మించాలని భావించడంతో ఇందులో సగం ఇళ్లు పూర్తి చేసిన నిరుపేదల కళ్లలో ఆనందం కనిపించేంది. ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగడం లేదు. విజయనగరం జిల్లాలోని రాజాం సెగ్మెంటు పరిధిలో పరిశీలిస్తే 9509 ఇళ్లు మంజూరు చేయగా 1532 పూర్తయ్యాయి. 65.92 కోట్లు రూపాయలు బిల్లులు చెల్లించారు. శ్రీకాకుళం డివిజన్‌లో కొంత వరకు ఇళ్ల నిర్మాణాలు ముందుకు కదులుతున్నా టెక్కలి, పలాస డివిజన్ కనీస పురోగతి లేదు. సీఎం తరచుగా రివ్యూలు చేస్తున్నప్పటికి క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కొద్ది రోజులు ప్రత్యేకాధికారులతో సమీక్షలు నిర్వహించడంతోకొంతమేరకు కదలిక వచ్చినా అటు బిల్లులు ఇటు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.
పొన్నాడే ఎగ్జాంపుల్
శ్రీకాకుళం నగరవాసులకు పొన్నాడలో భారీగా కాలనీ ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులకు స్థలం కేటాయించారు. దీంతో చాలా మంది ముందుకు వచ్చారు. తీరా అక్కడ ఈరోజు వరకూ విద్యుత్ సరఫరా ఇవ్వలేదు. పోల్స్ పాతి రెండు నెలలు గడచిన వైర్లు బిగించలేదు. ఏ వీధికి రోడ్డు లేదు. వీటిన్నంటికంటే ఇళ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులు గోడలు తడిపేందుకు కూడ నీరు అందడంలేదు. ఓ ట్రాక్టర్‌తో తెప్పించుకుంటే ఆరు వందల రూపాయలు కిరాయి చెల్లించాల్సి వస్తుంది. దీనికి తోడు ఇసుక కొరత కూడా ఉంది.
సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు సకాలం అందడం లేదు. అటు గుత్తేదార్లకు కొంత మేరకు బిల్లులు అవుతున్న సిమెంటు, ఇసుక, నీటి ఇబ్బందులతో వారు కూడా ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావడంలేదు. ఇది ఒక్క పొన్నాడే కాకుండా చాలా చోట్ల ఇదే సమస్య వెంటాడుతోంది. జనసేన పార్టీ నేతలు కాలనీ ఇళ్ల నిర్మాణాల జాప్యం, స్థలాల ఎంపికపై తీవ్ర ఆరోపణలు చేయడమే గాకుండా ఆ స్థలాల వద్ద నిరసనలు కూడా చేపట్టారు. గృహ నిర్మాణ శాఖాధికారులతో మిగిలిన శాఖాధికారులు సమన్వయంతో ముందుకు కదిలితే తప్ప కనీసం పది శాతమైన వచ్చే నెలలో గృహ ప్రవేశాలు చేసే అవకాశం లేదు. మరి జిల్లా యంత్రాం గం ఎటువంటి చర్యలు చేపడుతుందో చూడాలి మరి.