ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆ మధ్య కాలు బెణికిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయమే ప్రకటించింది. ఏప్రిల్ 5న జరిగిన ఒంటిమిట్ట కోదండరామ స్వామి కల్యాణానికి సీఎం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురావాల్సి ఉండగా, ముందు రోజు ఉదయం కాలు బెణకడం వల్ల నొప్పి ఎక్కువైందని, కల్యాణానికి హాజరు కాలేకపోతున్నట్లుగా సీఎంఓ అధికారులు ప్రకటించారు. అయితే, దీనిపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. విపక్షాలకు చెందిన వారు ముఖ్యంగా సీఎం జగన్  కోదండరామ స్వామి కల్యాణానికి రాకపోవడాన్ని తప్పు బట్టారు. కాలు బెణకడం అబద్ధమని ఏదో ఒక సాకుతో కల్యాణానికి రాకుండా సీఎం జగన్ తప్పించుకున్నారని విమర్శలు చేశారు. 


ఆ తర్వాత రోజే సీఎం జగన్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం వేదికగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రారంభించారు. కాలు బెణికితే ఆ సభకు ఎలా వచ్చారని, కనీసం సభపై నడుస్తున్నప్పుడు కూడా చక్కగానే నడిచారని విపక్ష నేతలు మాట్లాడారు. కాలు నిజంగా బెణికి ఉండి, నొప్పి కలిగి ఉంటే కనీసం కాస్తయినే నడకలో వ్యత్యాసం, లేదా మెల్లగా నడవడం లాంటిది చేసేవారు కదా అని అన్నారు.


శంకుస్థాపన కార్యక్రమంలో కాలుకు బ్యాండేజీ


తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు శంకుస్థాపన సందర్భంగా సీఎం జగన్ వచ్చినప్పుడు ఆయన కాలుకు బ్యాండేజీ ఉండడం కనిపించింది. శంకుస్థాపన సమయంలో కొబ్బరికాయ కొడుతున్నప్పుడు సీఎం తన చెప్పులను విడిచి, మామూలు కాళ్లతో వచ్చారు. అదే సమయంలో తీసిన ఫోటోల్లో సీఎం ఎడమ కాలి మడమకు బ్యాండేజీ ఉంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


ఈ ఫోటోలను వైఎస్ఆర్ సీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఉంచుతూ.. ‘‘గాయం ఇంకా తగ్గలేదా జగనన్నా’’ అంటూ ఫీల్ అవుతున్నారు. కాలికి గాయమైనా తన పనులు మానుకోకుండా కర్తవ్యాన్ని సవ్యంగా నిర్వర్తిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది విపక్షాల విమర్శలకు ఇది సమాధానం అని చెబుతున్నారు. సీఎం జగన్ కాలికి నిజంగానే గాయం అయిందని, అందుకు కాలికి ఉన్న బ్యాండేజే ప్రూఫ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సీఎం జగన్ కాలి మడమకు బ్యాండేజీ కనిపించడంతో కొద్ది రోజుల క్రితం ఆయనకు కాలు బెణకడం, ఆ నొప్పి వల్లే ఒంటిమిట్ట కోదండరామ స్వామి కల్యాణానికి రాలేకపోవడం నిజమని సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సీపీ అభిమానులు చెబుతున్నారు. దీంతో విపక్షాల విమర్శలకు చెక్ పెట్టినట్లయింది.