శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళీ మండలంలో మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి కూడా సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.


అంతకుముందు సీఎం జగన్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ లో మూలపాడుకు చేరుకున్నారు. తర్వాత సీఎం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల ఖర్చుతో మూలపేట పోర్టు పనులు చేపడుతున్నారు. 23.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్‌ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వాడుకొనేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని భావిస్తున్నారు. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 


మరిన్ని అభివృద్ధి పనులకూ శంకుస్థాపన


శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు కూడా బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan Srikakulam Tour) నేడు శంకుస్థాపన చేయనున్నారు.