వచ్చే సెప్టెంబరు నెల నుంచి తన కుటుంబం విశాఖపట్నానికి తరలి వెళ్తున్నట్లుగా సీఎం జగన్ ప్రకటించారు. మూలపేట పోర్టు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా తాను తన కాపురాన్ని వచ్చే సెప్టెంబరు నుంచి విశాఖపట్నానికి తరలిస్తున్నట్లుగా చెప్పారు. శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు. సంతబొమ్మాళి మండలంలో మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.


‘‘ఇవాళ నాలుగు మంచి కార్యక్రమాలు జరుపుకున్నాం. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ సహా హిర మండలం వంశధార లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకున్నాం.  నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేసుకున్నాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రాన్నే మార్చేస్తాయి. ఇకపై మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుంది. మూలపేట, విష్ణు చక్రం మరో ముంబయి, మద్రాస్‌ కాబోతున్నాయి. 24 నెలల్లో పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. అందుకోసం రూ.4,362 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 35 వేల మందికి ఉపాధి లభిస్తుంది. పోర్టు వస్తే.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి కాబట్టి, లక్షల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. 


గత ప్రభుత్వాలు మూలపేట పోర్టును పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా నాలుగు పోర్టులు మాత్రమే ఉండగా, మనం అధికారంలోకి వచ్చాక మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. తీరప్రాంత అభివృద్ధికి సంబంధించి గతంలో ఇలాంటి అభివృద్ధి ఎందుకు జరగలేదు?’’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపడానికే ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. గంగపుత్రులు వేరే ప్రాంతాలకు వలసలు పోకుండా ఉండేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం జరుగుతోందని, బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం తదితరులు పాల్గొన్నారు.


చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విమర్శలు



ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి, అదే నిజమని నమ్మించే చీకటి యుద్ధం ఇప్పుడు ఏపీలో నడుస్తోందని సీఎం జగన్ అన్నారు. పేదల పక్షాన నిలబడ్డ మీ బిడ్డకు, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న వారికి మధ్య నేడు యుద్ధం జరుగుతోందని అన్నారు.


‘‘ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు.. ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు. ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ బిడ్డ నమ్ముకున్నది.. దేవుడి దయ, మీ చల్లని దీవెనలు. తోడేళ్లంతా ఒక్కటవుతున్నాయి. ఈ అబద్ధాలను నమ్మకండి. వారి మాదిరిగా అబద్ధాలు చెప్పే అలవాటు మీ బిడ్డకు లేదు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగిందనుకుంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి.’’ అని అన్నారు.