Nara Lokesh Yuvagalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. మరో 12 రోజుల్లో ముగింపు సభ నిర్వహించనున్నారు. డిసెంబరు 17న భీమిలి నియోజకవర్గంలో సభ ఉంటుందని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. పాదయాత్ర ముగింపు సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా రప్పించనున్నట్లుగా పల్లా శ్రీనివాస్ వెల్లడించారు.
లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 6 తేదీకి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చేరుకుంటుంది. పాయకరావుపేట నుంచి ఈ నెల 7వ తేదీన యువగళం పాదయాత్ర మొదలై, ఈ నెల 17వ తేదీన భీమిలి నియోజకవర్గంలో ముగియనుంది. చెప్పారు. యువగళం ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
యువగళాన్ని కుదించిన పార్టీ
యువగళం యాత్రలో మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి జనవరి మొదటి వారం వరకు జరగాల్సి ఉన్న యాత్రను ఈ నెల 17నే ముగించాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లా వరకు కూడా కాకుండా విశాఖపట్నం జిల్లాలోనే యాత్రను ముగించనున్నారు. ఈ నెల 17 నాటికి యువగళం పాదయాత్ర భీమిలికి చేరుకుంటుంది. ఈ నియోజకవర్గంలో యాత్రను ముగించనున్నారు.
డిసెంబర్ 6న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు యువగళం పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ నుంచి 11 రోజులపాటు విశాఖపట్నం వ్యాప్తంగా లోకేశ్ పాదయాత్ర చేయబోతున్నారు. వైఎస్ఆర్ సీపీ భూ కబ్జాలు, అక్రమాలు, రిషికొండ తవ్వకాలు వంటి వాటిపై నారా లోకేశ్ తన గళాన్ని వినిపించనున్నారు. అనంతరం డిసెంబర్ 17న పాదయాత్రకు ముగింపు సభ ఉంటుంది.