రాష్ట్రానికి పట్టిన చీడ జగన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర టీడీపీ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న అన్నారు. ఆదివారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 16, 17, 18 తేదీల్లో పెందుర్తి, ఎస్ కోట, అనకాపల్లిలో రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమం జరుగుతుందని, అ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారని చెప్పారు. పంటకు చీడ పెట్టినట్టు రాష్ట్రానికి జగన్ చీడ పట్టుకుందని బుద్ధా వెంకన్న అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరిష్టాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. ఇపుడు మండుటెండల్లో అకాల వర్షాలు కురిసి పంటలు మునిగిపోయాయని అన్నారు. రైతులు విలవిలాడుతుంటే గత ప్రభుత్వంలో చేసిన వాటికి శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
జగన్ ఎక్కడ కాపురం ఉంటే అక్కడ సంక్షోభం క్షామం తాండవిస్తాయని అన్నారు. తాడేపల్లిలో కాపురం తర్వాత విజయవాడ పెద్ద పల్లెటూరు అయ్యిందని, ఇపుడు సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం అంటున్నాడని ఎద్దేవా చేశారు. అభివృద్ధి పథంలో ఉన్న విశాఖకు విజయవాడ పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దీంతో విశాఖ ప్రజలు వణికిపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే డీఎస్పీల నియామకం జరిగింది. ఉత్తరాంధ్రలో ఒకే వర్గానికి చెందిన వారిని నియమించారు. ఓ మాఫియాను తయారు చేయడానికి ప్లాన్ లో భాగమే ఈ నియామకాలు. పేదోడు ఇంకా పేదోడవ్వడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి’’ అని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు.
జగన్ ఆస్తులు దోచుకుంటే ప్రజలు తిరుగుబాటు చెయ్యాలని పిలుపు ఇచ్చారు. జగన్ కు బుద్ధి చెప్పడానికి ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోతే రాజకీయాల్లో తెరమరుగు అవుతాడని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకులు ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీలో సీనియర్ మంత్రుల బాధ వర్ణనాతీతం అని అన్నారు. రైతులు అల్లాడుతుంటే జగన్ ప్యాలెస్ లో మిన్నకున్నాడని అన్నారు. జగన్ స్కూల్ కాబట్టే కారుమూరి ఇష్టానుసారంగా రైతులపై వ్యాఖ్యలు చేశాడని అన్నారు. ఏపీ ప్రజలు మరోసారి చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
జగన్ సీఎం అయిన తర్వాత విశాఖలో ఆస్తులు కొల్లగొట్టాడని ఆరోపించారు. మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబుకి విశాఖలో ఒక్క ఆస్తి లేదని, ఉందని నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. విశాఖపట్నంలో మీరు కబ్జాలు చేశారని మీకు అక్రమ ఆస్తులు ఉన్నాయని నేను నిరూపిస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని బుద్ధా వెంకన్న సవాలు విసిరారు.
చంద్రబాబు పర్యటన తేదీలు ఖరారు - బుద్ధా వెంకన్న
ఉమ్మడి విశాఖలో చంద్రబాబు ఈ నెల 17, 18, 19 తేదీల్లో పెందుర్తి, ఎస్.కోట, అనకాపల్లి నియోజకవర్గాల్లో "ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి" కార్యక్రమంలో పాల్గొంటారని బుద్దా వెంకన్న తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాలపై ఉత్తరాంధ్ర నుంచే తిరుగుబాటు మొదలవ్వాలని అన్నారు. ఎన్నికల్లో పొత్తుపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. సీఎం వస్తోంది విశాఖ నుంచి ఇచ్చాపురం వరకు భూ ఆక్రమణల కోసమే అని అన్నారు. డీఎస్పీల నియామకాల్లో రాజకీయ జోక్యం వెనుక మాఫియా ఆలోచనలు ఉన్నాయని ఆరోపించారు. రైతుల సమస్యలపై ప్రతిపక్ష నాయకుడు రోడ్లపై తిరుగుతుంటే సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.